మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆయన ఎడమ కంటి పై భాగంలో కనుబొమ్మ పైన గాయం కావడంతో రెండు కుట్లు పడ్డాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. సీఎం జగన్పై దాడి జరగడంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీస్ శాఖ నిమగ్నమైంది.
జగన్పై దాడి జరిగిన ప్రదేశంలోని సెల్ లొకేషన్ టవర్ పరిధిలోని ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టడంతో పాటు సీసీ కెమెరాలను జల్లెడపట్టింది పోలీస్ శాఖ. కాగా బోండా ఉమా అనుచర వర్గంలోని వ్యక్తులే ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతుంది. అజిత్ సింగ్ నగర్ లో సీఎం వైయస్ జగన్పై దాడి చేసిన సతీష్ అలియాస్ సత్తి అనే వ్యక్తితో పాటు మరో నలుగురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్న సతీష్ అలియాస్ సత్తి బోండా ఉమా అనుచరుడు కావడం గమనార్హం.
ఇటీవల ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది పొందామని చెప్పిన గీతాంజలి అనే మహిళను సామాజిక మాధ్యమాల్లో బూతులు తిడుతూ పోస్టులు పెట్టి ఆమె ఆత్మహత్యకు కారణమైన పసుమర్తి రాంబాబు అనే వ్యక్తి కూడా బోండా ఉమా అనుచరుడే కావడం గమనించాల్సిన విషయం. పసుమర్తి రాంబాబుది కూడా అజిత్ సింగ్ నగర్ కావడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ టీడీపీ డెకాయిట్, రౌడీ షీటర్లకు అడ్డాగా ఉందని ఆ రౌడీ షీటర్లలో సగం మంది టీడీపీ ఎమ్యెల్యే అభ్యర్థి బోండా ఉమా అనుచరులే అన్న ఆధారాలు బయటపడుతున్నాయి.
కాగా సీఎం జగన్పై బోండా ఉమా అనుచరుడు సతీష్ దాడికి పాల్పడినట్లు రుజువైతే పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడినట్లు అనుమానించాలి. కాగా దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుట్రలో ఎవరెవరు పాలు పంచుకున్నారో త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్ని ధైర్యంగా ఎదుర్కొలేక, ఆయనకు విజయవాడలో దక్కుతున్న ఆదరణను ఓర్వలేక ఈ దాడికి పాల్పడినట్లు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.