టీడీపీ పార్టీలోనే అత్యంత వివాదాస్పద నాయకుడు బోండా ఉమ. ఎన్నికల నేపథ్యంలో తను ప్రవర్తిస్తున్న తీరుతో నవ్వులపాలు అవుతున్నారు. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది బోండా ఉమ తీరు. తను అప్పుడే గెలిచినట్టు మంత్రిని అయినట్టు ప్రవర్తిస్తూ ఓ నలుగురికి వాకిటాకీలిచ్చి తను చూట్టూ పెట్టుకున్నాడు. ఎవరైనా పార్టీ నాయకుడు గానీ కార్యకర్త గానీ బోండా ఉమను కలవాలంటే అడ్డుకొని వాకీటాకీ లో పై రూం లో వుండే బోండా ఉమ పక్కన వుండే మరోవ్యక్తికి చెప్పాలి. పై నుండి అనుమతి వస్తేనే లోపలికి పంపుతున్నారు లేకుంటే బయట నుండి బయటకి పంపుతున్నారు. ఇవన్నీ చూస్తున్న టీడీపీ నాయకులు అసలు ఎలక్షన్ ల ప్రచారమే కాలేదు అప్పుడే గెలిచినట్టు ఈ బిల్డప్ దేనికి అంటూ గొణుక్కుంటూ వెళ్తున్నారు.
విజయవాడ సెంట్రల్ లో వైసీపీ తరుపున వెల్లంపల్లి శ్రీనివాస్ కి టికెట్ కేటాయించారని ప్రకటించగానే తన ఆఫీసులో సంబరాలు జరిపి నేను ఎమ్మేల్యే అయిపోయాను 30వేల మెజారిటీ తో గెలుస్తానని, ప్రచారం కూడా చెయ్యాల్సిన అవసరం లేదంటూ బోండా ఉమ గొప్పలు పోవడం చూసి ఆరోజు విస్తు పోవడం టీడీపీ కార్యకర్తల వంతు అయింది. ఇక తన తరుపున ప్రచార వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టడానికి నియోజకవర్గంలోని ప్రతి వార్డుకు కొత్త వారిని నియమించుకొనే సరికి పాత నాయకులు మేము దేనికి ఉన్నాము అంటూ గొడవలు పడుతున్నారు. ఈ మధ్యనే బోండా ఉమ అఫీస్ లోనే కొత్త పాత నాయకులు ఘర్షణ పడ్డారు. అయిన బోండా ఉమ పట్టించుకోకపోవడంతో పార్టీ నేతలు రెండూ వర్గాలుగా చీలి పోయారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ మీద దాడి ఘటనతో నియోజకవర్గ ప్రజలు బోండా ఉమ వ్యవహారశైలి మీద గుర్రుగా ఉన్నారు. ఇప్పుడేమో అప్పుడే గెలిచినట్టు మంత్రి కూడా అయినట్టు వ్యవహరిస్తూ ఎవరిని కలవకుండా వుండటం చూసి ఉమ తన పద్ధతులు మార్చుకోకపోతే ఓడిపోవడం ఖాయమని ఇలానే వుంటే 30 వేలతో గెలవడం పక్కనబెడితే 30వేల ఓట్లతో ఓడిపోతాడు అని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.