టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు షాకిచ్చింది.. తమపై నమోదైన కేసును కొట్టేయాలని చంద్రబాబు చేసిన అభ్యర్ధనను తోసిపుచ్చింది. చంద్రబాబు పిటిషన్ ను కొట్టేయడంతో పాటు బాంబే హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
వివరాల్లోకి వెళితే 2010 జూలైలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి బాబ్లీ ప్రాజెక్టును చుట్టుముట్టి నిరసన తెలిపే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో మహారాష్ట్ర సరిహద్దుల్లోనే మహారాష్ట్ర పోలీసులు చంద్రబాబుతో పాటు 66 మందిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. కాగా కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడంతో వారిని ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తుండగా చంద్రబాబు, టీడీపీ నేత ఆనంద్ బాబు పోలీసులను అడ్డుకుని వారిని దూషించారు. మరోవైపు బస్సు ఎక్కించేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. . దీంతో అదనపు బలగాలను రప్పించి చంద్రబాబు, ఆనంద్ బాబు తదితరులను ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు.
కాగా తమపై నమోదైన ఈ కేసును కొట్టేయాలని చంద్రబాబు, ఆనంద్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను మంగేష్ పాటిల్, శైలేష్ బ్రహ్మేలతో కూడిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ డివిజన్ బెంచ్ కొట్టేసింది. చంద్రబాబు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని, తన అనుచరులను పోలీసులపై దాడి చేసేందుకు పురికొల్పారని సాక్షులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉద్దేశ్యపూర్వకంగానే పోలీసులపై దాడికి దిగారని చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు బెంచ్ కొట్టేసింది.