రానున్న ఎన్నికల నేపథ్యంలో కూటమి పొత్తు ఖరారు అయింది. సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయి. అభ్యర్థుల ప్రకటన జరిగిపోయి, ప్రచారంలో మునిగి తేలుతున్నారు. కానీ ఇప్పుడు అసలు సమస్య వచ్చి పడింది. టీడీపీలో కొంతమంది సీనియర్ నాయకులకు సీట్ నిరాకరించడంతో టీడీపీకి పనిచేయరని భావించిన చంద్రబాబు .. కొంతమంది నేతలను జనసేనలోకి పంపించి అక్కడ టికెట్లు వచ్చేలా చేశాడు. మరి కొంతమంది బీజేపీలోకి పంపి వారికి టికెట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా అది బెడిసి కొట్టినట్లు సమాచారం, అది నిజం చేసేలా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ మీడియాతో తెలిపారు.
పొత్తులో బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు విషయంలో గానీ, ఆయా స్థానాలకు ఇప్పటికే పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విషయంలోగానీ ఎలాంటి మార్పులు ఉండవని కేంద్ర పార్టీ తరఫున రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సిద్ధార్థనాథ్ సింగ్ మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సీట్లు మార్పు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీకి కేటాయించిన నరసాపురం లోక్సభ, అనపర్తి అసెంబ్లీ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందంటూ గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సోషల్ మీడియాతో పాటు వారి అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానిపై సిద్ధార్థనాథ్ సింగ్ వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి తెరపడినట్లేనని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.