ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు ఓటమిపాలవుతారనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుందనేది అందరికి తెలిసిన విషయమే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటల్లో బెట్టింగులు సైతం జోరుగా సాగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కొంతమంది జగన్ మళ్ళీ అధికారం చేపడతారని పందాలు కాస్తుంటే కాదు టీడీపీ అధికారంలోకి వస్తుందని మరి కొందరు బెట్టింగ్ కాస్తున్నారు. వీళ్ల వ్యసనాన్ని క్యాష్ చేసుకునేందుకు బుకీలు కూడా రాష్ట్రలో తిష్ట వేశారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఏపీ-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేత దగ్గరి బంధువు వద్ద 68.40 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. అయితే సదరు వ్యక్తి దగ్గర ఆ నగదుకు సంభంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకొని, చిల్లకల్లు పోలీసులకు అప్పగించారు. ఈ నగదు తెస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే మాజీ ఎమ్మెల్సీ (టీడీ జనార్ధన్) కు దగ్గరి బంధువు అనే ఆరోపణలు వస్తున్నాయి.
అయితే నగదు పట్టుబడిన వ్యక్తి బుకీగా వ్యవహరిస్తారని ఆ డబ్బంతా ఎన్నికల ఫలితాలపై పందేలు కట్టిన వారి నుంచి వసూలు చేసి తెస్తున్నదని, ఈ డబ్బుని టీడీపీ కేంద్ర కార్యాలయానికే తరలిస్తున్నారని, టీడీపీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా బెట్టింగులు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నాయని తీవ్రమైన ఆరోపణలు ప్రత్యర్ధిపార్టీల నుండి వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు టీడీపీ వివరణ ఇస్తుందో లేదో వేచి చూడాలి.