40ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబుకి ‘అంతా నేనే అన్నీ నేనే’ అని చెప్పుకోవడం అలవాటే. ప్రతీ విషయంలో హైదరాబాద్ ని ప్రపంచపటంలో నేనే పెట్టా. సెల్ ఫోన్ నేనే కనిపెట్టా. సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా నేనే చేశా అంటూ ప్రజలను కితకితలు పెట్టే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కూడా హైదరాబాద్ ప్రస్తావన తీసుకురావడం మానడం లేదు.
వాస్తవానికి 500 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరానికి ముందు నుండే గుర్తింపు ఉంది. అయినా హైదరాబాద్ కు ఫౌండేషన్ వేసింది నేనే అని చెప్పుకోవడం బాబుకు అలవాటుగా మారిపోయింది. చంద్రబాబు 1995 నుంచి 2004 దాక 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి హైదరాబాద్ ను ప్రపంచ పటం లో పెట్టింది నిజం అయితే 2014-19 మధ్య ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి అమరావతిలో వర్షం వస్తే నీరు కారే రెండు తాత్కాలిక బిల్డింగ్ లు మాత్రమే ఎందుకు కట్టారంటే మాత్రం సమాధానం ఉండదు. 1995 లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం కాకముందే హైదరాబాద్ లో 100 కు పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటుగా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటితోపాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సాఫ్ట్ వేర్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేసా అని చెప్పుకోవడానికి చంద్రబాబు ఏమాత్రం సిగ్గు పడడు.
21 మే 1992 వ సంవత్సరంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి స్వయంగా హైదరాబాద్ కి తలమానికంగా మారిన ఇప్పటి సైబర్ టవర్స్ భవననిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాకముందు ఆంధ్రప్రదేశ్ స్థానం మూడు కాగా 2004 లో చంద్రబాబు దిగిపోయేనాటికి ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానానికి దిగజారడం గమనార్హం. కానీ ఆంధ్రప్రదేశ్ ఐటీ పితామహుడిగా తన అనుకూల మీడియాలో డప్పు చేయించుకున్న చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసాడు.
వాస్తవానికి హైదరాబాద్ వేగంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అభివృద్ధి చెందిందని జేఎన్టీయూ శాస్త్రవేత్తలు 2015లో రిపోర్ట్ కూడా ఇచ్చారు. వైఎస్ హయాంలో ఐఐటీ,యూఎస్ కాన్సులేట్, బిట్స్ పిలానీ, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టిసిఎస్ కంపెనీలు రాగా, మైక్రోసాఫ్ట్ మూడోదశ, విప్రో రెండో దశ పనులు మొదలయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ , ఔటర్ రింగ్ రోడ్ , పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పూర్తి చేయడమే కాకుండా మెట్రోకు కూడా వైఎస్ శ్రీకారం చుట్టారు. వైఎస్ కృషితో ఐదో స్థానానికి పడిపోయిన ఏపీ స్థానం మూడుకు ఎగబాకింది. హైదరాబాద్ శివారులో ఉన్న తొమ్మిది మునిసిపాలిటీలు కలిపి జిహెచ్ఎంసిని ఏర్పాటు చేసి హైదరాబాద్ కు ఏ1 స్టేటస్ తెచ్చారు
దీనివలన ఉద్యోగుల హెచ్ ఆర్ఏ 10 శాతం పెరిగింది. వైఎస్ హయాంలోనే 50 వేల ఎకరాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఆర్) ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. 2014 లో కేసీఆర్ సీఎం అయ్యాక ఐటీ రంగం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందింది. వాస్తవాలు ఇలా ఉంటే హైదరాబాద్ ని ప్రపంచపటంలో పెట్టింది నేనే అంటూ చంద్రబాబు చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలను మభ్యపెట్టే రోజులు పోయాయని బాబు ఎప్పుడు గ్రహిస్తారో ఏమో?