జనసేన పార్టీలో ముసలం పుట్టింది. పోతిన మహేష్ ఉదంతం జనసేన పార్టీలో ఒక్కసారిగా కలకలం రేపింది. సీట్ల కేటాయింపులలో జరిగిన అవమానంతో మనస్థాపానికి గురైన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ పార్టీ బాధ్యతలు క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనితో ఒక్కసారిగా విజయవాడ జనసేన పార్టీలో కలవరం మొదలైంది. పవన్ కళ్యాణ్ తీరని నిరసిస్తూ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో జెండాలను తగలబెట్టి, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు నిప్పంటించారు.
గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసిన బత్తిన రాము ఇప్పటికే పార్టీకి దూరంగా ఉన్నారు, జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తన బాధ్యతలకు రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలోసీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జనసేన పార్టీ ప్రచార కమిటీల సమన్వయకర్త ఎడవల్లి సతీష్ తో పాటు వందలాదిమంది కార్యకర్తలు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ టీడీపీకి కోవర్టుగా పనిచేస్తున్నాడని అతని దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఇప్పటికే టికెట్ మోసంతో ఎవరు మనస్థాపానికి గురైన పెడన జనసేన పార్టీ అధ్యక్షుడు సమ్మిటబాబు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడిన పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంతో పలువురు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, జిల్లా సమన్వయకర్త చెన్నగిరి సత్యనారాయణ, అవనిగడ్డ టౌన్ ప్రధాన కార్యదర్శి సహా పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు జనసేన పార్టీ లో తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీని నమ్మి పార్టీ కోసం సర్వం త్యాగం చేసి రోడ్డును పడ్డ కుటుంబాలు ఇకకు మించి ఉన్నాయి. ఒక నిర్దేశిత సిద్ధాంతం లేకుండా, నిర్ణయాత్మకమైన అడుగులు లేకుండా ఈ అర్థం పదం లేని పొత్తు దేనికో.. కూటమి వల్ల ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నాడో పవన్ కళ్యాణ్ అని తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. 21 అసెంబ్లీ స్థానాలు 2 ఎంపీ స్థానాలతో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ సాధించేది ఏమిటి అని సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు.