తనకి ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో, ఎప్పుడు ఎవర్ని కొడతాడో ఎవరికీ అర్ధం కాదు. ఒక్కోసారి దగ్గరికి వస్తే దవడ పగలగొడతాడు, సినీ షూటింగ్స్ లో టచప్ వాళ్ళని ఎందుకు కొడతాడో వాళ్లకి కూడా తెలీదు. ఒక్కో సారి ఎవరైనా సెల్ఫీ అడిగితే చాలు కోపోద్రిక్తుడు అయిపోతాడు. ఆయనే హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఇలాంటివి వరుస సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ రోజు తాజాగా మరోసారి తన అహం ప్రదర్శించాడు బాలకృష్ణ. అభిమాన నటులు , నాయకులతో ఫోటోలు, సెల్ఫీలు దిగడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. కొంతమంది తమ అభిమానులకు ఓపికగా ఫోటోలు ఇస్తుంటే , కొంతమంది బాలకృష్ణ పంధాను ఎంచుకుంటారు.
ఈ రోజు బాలకృష్ణ మరో సారి తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి హెలికాప్టర్ ద్వారా కదిరికి వచ్చాడు. బాలకృష్ణ హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడికి వచ్చిన అతి కొద్ది మందిలో ఒకరు బాలకృష్ణతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి నెట్టుకోవడంతో బాలకృష్ణ ఆగ్రహానికి గురై, అభిమాని చెంప చెల్లుమనిపించాడు. ఏమి చేయాలో తెలియాక , అవమానానికి గురైన సదరు అభిమాని ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు.ఈ సంఘటనతో అక్కడున్న వారంతా షాక్ కు గురైయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.