ఉక్కు పరిశ్రమ పనులు మొదలు అయ్యాయని ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ జిందాల్ స్టిల్స్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఉక్కు పరిశ్రమ పనులు సాగుతున్నాయని తెలిపారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయని తద్వారా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పించామని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ చేసిన అభివృద్ధిని చూసి ఆయన చేస్తున్న ప్రచారంలో ప్రజలంతా నీరాజనం పడుతున్నారని, కరోనా సమయంలో కూడా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపారని ఆ అభివృద్ధిని చూసి ప్రజలంతా ఓటు వేయాలని అవినాష్ రెడ్డి కోరారు. గండి కోట ప్రాజెక్ట్ ద్వారా 26 టీఎంసీల నీళ్లు నిలువ చేయగలిగాము కాబట్టి, ప్రజల దాహార్తి తీర్చగలిగామని, కడప రిమ్స్ లో మూడు రకాల ఆసుపత్రులు తెచ్చి ప్రజలకు వైద్యం చేరువ చేశామని ఆయన వెల్లడించారు. సీఎం జగన్పై దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని తెలిపిన అవినాష్ రెడ్డి, రాష్ట్రంలో 175 స్థానాల్లో వైసీపీ విజయ కేతనం ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతుండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల సమరంలో పోటీకి దిగాయి. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కూటమి ప్రచారంలో వెనుకపడింది.