ఏపీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర వారు ఎవరికి అండగా వుంటారో వారే అధికారంలోకి వస్తారని నానుడి. గత రెండు ఎన్నికల్లో అది రుజువు అయింది. 2014 లో ఉత్తరాంధ్రలో టీడీపీకి 25 సీట్లు ఇచ్ఛారు,అలాగే 2019లో వైసీపీకి 29 సీట్లు ఇచ్చారు. ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ. అందులో తూర్పు కాపులు, యాదవ్, మత్స్యకారులు ఎక్కువ . అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఎటు మొగ్గినా పూర్తిగా ఒకసైడ్ ఉంటారు తప్పా సగం సగం మొగ్గు చూపడం అనేది ఉండదు. ఇప్పుడు అదే రీతిలో ఎవరికి మొగ్గు చూపుతారో అని ప్రధాన పార్టీలు, రాజకీయా పరిశీలకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర అంతా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. దానితో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇక్కడ అధికార పార్టీ వైసీపీకి మాత్రం ప్రచారంలో జనహోరు కన్పిస్తుంది. కూటమికి సొంత కుంపటి రెబల్ రాజకీయాలతో తలబొప్పి కట్టింది.
ఉత్తరాంధ్రలో అధికార పార్టీ ప్రత్యేక శ్రద్ధపెట్టి గత ఐదు సంవత్సరాలుగా పని చేసుకుంటూ వస్తున్నారు. ఉద్దానం సమస్య తీర్చి ఇంటింటికి మంచి నీరు, కిడ్నీ రిసెర్చ్ హాస్పిటల్ పూర్తి చేశారు , మూలపేట పోర్టు నిర్మాణం ప్రారంభించి శరవేగంగా పనులు చేస్తున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్, ట్రైబల్ యూనివర్శిటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభించడం ద్వారా జిల్లాలో జరిగిన అభివృద్దితో ధీమాగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు మెడికల్ కాలేజీ లు ,కొత్త నేషనల్ హైవేలు, గ్రేటర్ విశాఖను రాజధానిగా ప్రకటించి రోడ్లు, సుందరీకరణ పనులు పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు అభివృద్ది పనులు వేల కోట్లతో చేయడంతో పెద్ద ఎత్తున ఆ పార్టీకి మద్దతు లభిస్తోంది. అంతే కాకుండా జగన్ ఈ మధ్య కాలంలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలో కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అవడంతో పాటు పార్టీకి తిరుగులేకుండ చేసింది. ఇప్పటికే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రెండు సభలు జరిగితే అవి భారీ హిట్ అయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ లో అందరూ నాయకులు కలిసి కట్టుగా ఒకరికి ఒకరు ప్రచారం చేసుకుంటూ వస్తూ విజయానికి బాటలు వేసుకుంటున్నారు.
ఇక కూటమి విషయానికి వస్తే రెబల్స్ దెబ్బతో తమ విజయావకాశాలు 18-20 నియోజకవర్గాల్లో సన్నగిల్లాయి. నిలబడిన అభ్యర్థులు తల పొగరుతో మిగతా వారిని కలుపుకుపోకపోవడంతో ఎవరికి వారే యమున తీరే అన్నట్టు వున్నారు. కేవలం డబ్బు ఖర్చు చేసి గెలుద్దామనే రీతిలోనే ఉన్నారు తప్ప ప్రజల మద్దతుతో గెలుద్దామనే ఆలోచనే వారికి లేదు. ఇప్పటివరకు జరిగిన ప్రచార సరళితో పాటు జరిగిన అభివృద్దితో సైలెంట్ గా వున్న ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు మీడియా ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలుపుండటం గమనార్హం.