రాష్ట్ర ప్రజలంతా వైభవంగా జరుపుకునే సంక్రాతి కానుకగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. నేటినుండి అనగా జనవరి 6 నుంచి 18 వరకూ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది. కాగా స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. దీంతో ప్రయాణికుకులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ చార్జీల సాకుతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ
ఏపీలో దశాబ్దాలపాటుగా పండుగల సమయంలో ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సు సర్వీసుల్లో అధిక చార్జీలు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ప్రయాణికులపై సాధారణ చార్జికి అదనంగా అనగా టికెట్ రేటుకంటే 50శాతం ఎక్కువగా చార్జీలను ఆర్టీసీ వసూలు చేసేది. పండగ సమయాల్లో ప్రయాణాల్లో ఏర్పడిన రద్దీ కారణంగా కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించేవారు. కానీ ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటూ ఆర్టీసీ ప్రయాణికులపై మోపుతున్న అధిక చార్జీలను సాకుగా చూపుతూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సాధారణ చార్జీల కంటే రెండుమూడు రెట్లు అధికంగా వసూలు చేయడంతో ప్రయాణికులపై మోయలేని భారం పడేది.
కాగా అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు సంక్రాతి దసరా వంటి పండగ సమయాల్లో సాధారణ చార్జిలతోనే ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. దాంతో 2021 నుండి వరుసగా నాలుగో ఏడాది కూడా ప్రయాణికులపై అదనపు భారం పడకుండా సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.
పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు
పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. మొత్తంగా 6795 స్పెషల్ బస్సులు నడపనుంది. జనవరి 6 నుంచి 18 వరకూ ప్రత్యేక బస్సులు నడవనున్నారు. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ నెల 6 నుంచి 14 వరకు 3,570 సర్వీసులు నిర్వహిస్తుండగా, తిరుగు ప్రయాణం నిమిత్తం ఈనెల 16 నుంచి 18 వరకు 3,225 ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడపనుంది. అంతేకాకుండా రానుపోను టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి ప్రయాణపు ఛార్జిలో 10 శాతం రాయితీని ఆర్టీసీ కల్పించనుండడం విశేషం. ప్రయాణ సమయంలో చార్జీలకు చిల్లర సమస్య లేకుండా యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్‌పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు