తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడింది. నిమ్మగడ్డ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోవడంతో దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గత నెల అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయాల్లో పింఛన్ పంపిణీ చేపట్టింది ప్రభుత్వం. అయితే మండుటెండలో వృద్ధులు పింఛన్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు సొమ్మసిల్లిపడిపోయారు. అధిక ఎండల వల్ల దాదాపు ఏప్రిల్ నెలలో 31 మంది వృద్ధులు చనిపోయారు. ఏప్రిల్ లో సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు కానీ మే నెలలో సచివాలయ ఉద్యోగుల ఎన్నికల విధులు వల్ల ఆ కార్యక్రమాన్ని కొనసాగించలేక పోయారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం మే నెల పెన్షన్ ను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో వేయాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలు లేని వారికి పెన్షన్లను సచివాలయాలు దగ్గర పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ ఉన్న పెన్షన్ల దారులకు బ్యాంక్ అకౌంట్లో డబ్బుని జమ చేసింది. బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ కావడంతో పెన్షన్ దారులు ఆ డబ్బును తీసుకోవడానికి బ్యాంకులు దగ్గర బారులు తీరారు.
ఇక బ్యాంకులో ఖాతా ఉన్నవారు ఉదయం 7 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. తమకు పింఛన్ వస్తుందన్న ఆశ వారిలో కనిపించింది. ఉదయం 11 గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్నారు. చివరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సర్వర్ పనిచేయడం లేదంటూ బోర్డులు పెట్టడంతో పెన్షన్ కోసం వేచి ఉన్న వృద్ధులు కలత చెంది, ఆవేదనతో ఇంటిముఖం పట్టారు. బ్యాంకులో సర్వర్ పనిచేయడం లేదని రేపు రమ్మంటున్నారంటూ మహిళలు చెప్పారు. అయితే రేపు కూడా ఇస్తారో లేదో అన్న నమ్మకం తమకు లేదని కన్నీటి పర్యంతమయ్యారు. మండుటెండలు ఒకవైపు, బ్యాంక్ సర్వర్లు పని చేయకపోవడం మరోవైపుతో పెన్షన్ దారులు పెన్షన్ అందుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు.