Pensions : ఒకటో తేదీ వచ్చింది.. ఇకేముంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ మొదలైంది. గురువారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పింఛన్(Pensions) సొమ్మును ఇవ్వడం ప్రారంభించారు. ప్రతి అవ్వను పలకరించి.. తాత ఆరోగ్యం గురించి ఆరాతీసి.. వాళ్ల మనవడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపిన డబ్బును నవ్వుతూ చేతిలో పెడుతున్నారు. రాష్ట్రంలో కానుక లబ్ధిదారులు 66.15 లక్షల మంది ఉన్నారు. వారి కోసం ప్రభుత్వం రూ.1,961.13 కోట్లను కొద్దిరోజుల క్రితమే విడుదల చేసింది. బుధవారం సచివాలయ సిబ్బంది బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకొచ్చి వలంటీర్లకు అందజేశారు. మొత్తం ఐదురోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా పొలం పనులకు వెళ్లుంటే అక్కడికి వెళ్లి నగదు ఇస్తారు. అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుంటే వలంటీర్లు సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్లి పింఛన్ సొమ్ము అందజేసి ప్రభుత్వం అండగా ఉందని భరోసా కల్పిస్తారు.
విజయవంతం చేద్దాం
పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 2.66 లక్షల మంది వలంటీర్లు, 15,000 మంది సచివాలయాల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు పాల్గొంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. నగదు అందజేతకు లబ్ధిదారు గుర్తింపు కోసం ఆధార్ నిర్ధారిత బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక కారణాలతో పింఛన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా ఈ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశించామన్నారు. 26 జిల్లాల డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పంపిణీని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ధృడ సంకల్పంతో పెన్షన్ కానుక అందిస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.