ఆంధ్రప్రదేశ్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతుండగా మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీకి దిగాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఉధృతంగా ప్రచారం చేస్తుండగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కూడా కొనసాగిస్తున్నారు. కాగా ఏపీలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలిజాబితాను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సీపీఐ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇప్పుడు సిపిఐ పోటీ చేయబోతున్న స్థానాలపై ఒక క్లారిటీ వచ్చింది.
ఏపీలో జరగబోతున్న ఎన్నికల్లో సీపీఐ ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రకటించారు. దాంతో పాటు పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో కుదిరిన పొత్తు ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తుంది. కాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం కల్పించే క్రమంలో అభ్యర్థులను ఎంపిక చేశామని ఈ ఎన్నికల్లో తిరిగి పుంజుకుంటామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది.