సీఎం జగన్ తన పరిపాలనలో పారదర్శకత విధానంతో తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాల వల్ల ఏపీకి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. తాజాగా మైనింగ్ విభాగంలో సీఎం జగన్ చేపట్టిన సంస్కరణల ఫలితంగా కేంద్రం నుంచి మరో అవార్డును ఏపీ దక్కించుకుంది. వివరాల్లోకి వెళితే మేజర్ మినరల్స్ ఆక్షన్ లో జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచిన ఏపీకి అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్ లభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి అవార్డును కూడా ప్రకటించింది. ఈ నెల 23వ తేదీ భోపాల్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వానికి అవార్డును ప్రధానం చేయనున్నారు.
సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి మైనింగ్ రంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. మైనింగ్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడంతో పాటు అవినీతిని నియంత్రించడంలో సఫలీకృతం అయ్యారు. పూర్తి పారదర్శక విధానంతో మెరుగైన సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా మైనింగ్ శాఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా సంస్కరణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం తీసుకున్న విప్లవాత్మక చర్యల కారణంగా మేజర్ మినరల్స్ బ్లాక్ లకు నిర్దిష్టకాల పరిధిలో మైనింగ్ శాఖ ఆక్షన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి లెటర్ ఆఫ్ అవార్డు(ఎల్ఏ)ను కూడా జారీ చేసింది. గడిచిన ఏడాది కాలంలో11 బ్లాక్ లకు ఆక్షన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ జాతీయ అవార్డును ప్రకటించడం గమనార్హం.
2022-23 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 105 మేజర్ మినరల్ బ్లాక్ లకు ఆక్షన్ నిర్వహించగా, ఏపీ ప్రభుత్వం 11 బ్లాక్ లకు ఆక్షన్ నిర్వహించి లెటర్ ఆఫ్ అవార్డు(ఎల్ఏ)లు జారీ చేసి 3వ స్థానంలో నిలిచింది. కాగా ఈ నెల 23న భోపాల్ లో జరిగే కాన్ఫెరెన్స్ లో ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రదానం చేయనుంది. ఈ మేరకు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వీణాకుమారి రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు.