డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్.. మొన్నటి వరకు నెల్లూరు సిటీలో తన మార్క్‌ని చూపించారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నరసారావుపేట పార్లమెంట్ ఇన్చార్జిగా తనదైనశైలిలో దూసుకెళ్తున్నారు. సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమోషన్ ఇచ్చి నరసారావుపేట పార్లమెంట్‌కు పంపారు. ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు, అధికారులను సమన్వయం చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. గత ఐదేళ్ల కాలంలో ప్రారంభించిన పనులు.. అవి ఏ దశలో ఉన్నాయి.. ఎంత సమయంలో పూర్తవుతాయి తదితర వివరాలు సేకరిస్తున్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎప్పటిలోగా ఆ పనులను పూర్తి చేస్తామో చెబుతున్నారు. అనిల్ ఫుల్ స్పీడ్‌లో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉన్న అనిల్ పల్నాడు ప్రాంతంలో ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని ఆరునెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండాలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను అనిల్ మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్ల పల్నాడు ప్రజల కల అయిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకం జగనన్న వల్ల సాకారమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు తెలిపారు.
చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కేంద్ర అనుమతులు సాధించలేకపోయారు. ప్రజల్ని మోసం చేసేందుకు శంకుస్థాపనల పేరుతో హడావుడి చేశారు. తాము పనులు ప్రారంభించి చేస్తుంటే టీడీపీ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. గతంలో బాబు చేసిన నిర్వాకాలను చూసి ఆయన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు సాధించాలని మొదటి కేబినెట్ మీటింగ్‌లోనే అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న నాకు సీఎం చెప్పారు. ఆనాటి అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులను కలుపుకొని అవసరమైన అనుమతులు సాధించాం. జగనన్న చొరవతో మొదటి దశ పనులను వచ్చే ఆరునెలల్లో పూర్తి చేస్తామని అనిల్ ప్రకటించారు.