2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులే తీసుకొచ్చింది. విద్యా విధానంలో మార్పులు, ప్రభుత్వ పాఠశాలలో విద్యాసంస్కరణలు, నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మార్పులు, ఆధునిక క్లాస్ రూమ్ ల ఏర్పాటుతో చాలా మార్పులు తీసుకొచ్చారు.
అందులో మొదటగా అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేశారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 8 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ఆంగ్లంలో బోధన చెపిస్తున్నారు. అంగన్వాడీలను ప్రైమరీ స్కూళ్లుగా మార్చిన నేపథ్యంలో ప్రీ ప్రైమరీ స్కూల్ అనుగుణంగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది.
గతంలో కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లకే పరిమితమైన ఖరీదైన ఆంగ్ల విద్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో చదివే పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఆంగ్ల విద్యను చేరువ చేశారు. పౌష్టికాహారం అందజేయడంతో పాటు, చిన్నారుల్లో మానసిక ఆనందమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా ప్రభుత్వం మార్చింది. అన్ని ప్రాజెక్టుల చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55 వేల ప్రీ ప్రైమరీ స్కూళ్లలో టీచర్లు చిన్నారులకు ఆంగ్లంలో ఓనమాలు దిద్దిస్తున్నారు. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ స్కూల్ సిలబస్ ను సైతం ప్రత్యేకంగా రూపొందించింది.
అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలను ఆంగ్ల బోధనకు అనుగుణంగా టీచర్లుగా మార్చారు. ఈ మేరకు వారికి గతేడాది ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కార్యకర్తలకు మహిళా, శిశు సంక్షేమశాఖ పీడీ, సీడీపీవోల పర్యవేక్షణలో సూపర్ వైజర్ల ద్వారా ఆంగ్ల భాష నైపుణ్యాలను బోధించారు. బోధన పద్ధతులు, పాటించాల్సిన విధివిధానాలపై వారం పాటు శిక్షణ ఇచ్చారు. ఇలా ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి ఆంగ్లంలో బోధన ద్వారా చిన్నారులు పెరిగిన తర్వాత ఆంగ్ల బోధనలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.