ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశంలో పరిటాల కుటుంబానికి గతంలో బాగా పట్టుంది. రవి చనిపోయినా ఆయన భర్య సునీత, కుమారుడు శ్రీరామ్ ఆ పాత తరహా రాజకీయాలు ఇంకా వీడలేదు. చంద్రబాబు నాయుడు ఇంత కాలం వారిని కాదనలేదు. కానీ 2024 ఎన్నికల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. శ్రీరామ్‌ను పో పోవయ్యా అనేసి భారతీయ జనతా పార్టీ నాయకుడు సత్యకుమార్‌కు బాబు టికెట్ ఇచ్చారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఆ జిల్లా వాసులు సత్య చరిత్ర తవ్వడం మొదలుపెట్టగా ఆయన ఘనకార్యాలు అనేకం వెలుగు చూస్తున్నాయి.
సత్యకుమార్ అనంతపురం జిల్లా వాసి కాదు. అతని పూర్వీకులది మహారాష్ట్ర. వాళ్లు ప్రొద్దుటూరుకు వలస వెళ్లారు. కులం విషయంలో సత్య అబద్ధాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తనది యాదవ సామాజికవర్గమని చెప్పుకొంటున్నాడు. కానీ క్షత్రియ అని గతంలో పలుమార్లు చెప్పాడు. ఇక చదువుకునే రోజుల్లోనే అతను దారి తప్పినట్లు కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. మదనపల్లెలో విద్యనభ్యసిస్తున్న రోజుల్లో హత్య కేసులో ఇరుక్కొన్నాడు. ఆ సమయంలోనే ముప్పవరపు వెంకయ్య నాయుడితో పరిచయమైందని చెబుతారు. ఆ కేసులో ఆయన కాపాడాడు. దీంతో సత్య వెంకయ్య మనిషిగా మారిపోయాడు.
వెంకయ్య వెంట తిరగడం మొదలుపెట్టాక సత్య ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోయింది. 1996లో ప్రొద్దుటూరు నుంచి బస్సు ప్రయాణం చేసి నెల్లూరుకు చేరుకునే వ్యక్తి అతను. సాధారణ కుటుంబం నుంచి వచ్చానని చెబుతుంటాడు. కానీ నేడు హోటళ్లు, వ్యాపారాలు, కమర్షియల్ ప్లాట్స్, హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులున్నట్లు విమర్శలున్నాయి. సత్య బంధువులు ప్రొద్దుటూరులో అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. కానీ అతని ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఇది ఎలా సాధ్యమైందో ప్రజలకు సమాధానం చెపాల్సిన అవసరం ఉంది.
సత్య మొదట వెంకయ్య ఓఎస్డీగా ఉన్న సమయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను పరిచయం చేసుకుని ప్రలోభపెట్టి బాగా వెనుకేసుకున్నాడు. అంతటితో ఆగలేదు. తన బాస్ అండతో ఉత్తరప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు ఇన్చార్జిగా ఉండి జేబులు నింపుకొన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇప్పిస్తానని అనేక మందిని మోసం చేసిన చరిత్ర ఉంది. తాను పవర్ ఫుల్ వ్యక్తినని ఏపీలో నిత్యం చెబుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ వల్ల బీజేపీ అధికారంలోకి వస్తే.. నేనే కారణమని ఇక్కడ బీసీ సంఘాలతో సత్కారం చేయించుకుని బిల్డప్ ఇచ్చారు. కమలం పార్టీ నాయకులు, కార్యకర్తలను వెనుక తిప్పుకొనేందుకు ఇలా చేశారు.
సత్య కుమార్ ఏ రోజు ఏపీలో బీజేపీ కోసం కష్టపడలేదు. అటు వెంకయ్య నాయుడు.. ఇటు చంద్రబాబు సేవలో తరించాడు. పార్టీలో చాలా సీనియర్‌నని చెబుతుంటాడు. అయితే కనీసం కౌన్సిలర్‌గా పోటీ చేయలేదు. ఇక్కడ ఒక్కరిని కూడా గెలిపించిన దాఖలాల్లేవు. అతని పని ఏంటంటే నమ్మిన వారిని మోసం చేయడం, కాంట్రాక్టులు ఇప్పిస్తానని లాబీయింగ్ చేయడం. దీనిని ఆయన సన్నిహితులే బహిరంగంగా చెబుతున్నారు. కుప్పం మెడికల్ కాలేజీలో మెడికల్ సీటు ఇప్పిస్తానని సుశీల అనే విద్యార్థి తల్లితండ్రుల దగ్గర రూ.20 లక్షలు తీసుకున్న ఘనుడు ఇతను.
తనది ప్రొద్దుటూరని సత్యకుమార్ చెబుతుంటారు. కానీ అక్కడ పోటీ చేయకుండా ధర్మవరం వచ్చాడు. వాస్తవానికి ఈ సీటును గోనుగుంట్ల సూర్యనారాయణకు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు తానే రంగంలో దిగాడు. పరిటాల కుటుంబానికి చెక్ పెట్టడానికే బాబు తనకు సన్నిహితుడైన సత్యను తెచ్చాడని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. బాబు అండ చూసుకుని కమ్మ సామాజికవర్గాన్ని తన చుట్టూ పెట్టుకున్నాడు. బీసీనని చెప్పుకొనే ఈ వ్యక్తి వారినే దూరంగా పెట్టాడు. బీజేపీలో కార్యకర్తలు మీటింగ్ పెడితే లోకల్ నాయకుల ప్రమేయం లేకుండా చేస్తాడు. కేవలం నాయకులతో నడిపిస్తాడని ప్రచారం ఉంది.
చాలా కాలంగా సత్యకుమార్ చంద్రబాబు డైరెక్షన్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. కాషాయం జెండా కప్పుకొన్న ఎల్లో మనిషి కావడంతో ఏమి చెప్పినా ఎల్లో మీడియా హైలెట్ చేసింది. ఇప్పుడు ధర్మవరం సీటును ఎగరేసుకుపోయిన సత్య స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై ఆరోపణలు చేసే క్రమంలో అభివృద్ధి జరగలేదని, నీళ్లు రావడం లేదని అవగాహన లేకుండా అనేస్తున్నాడు. నిజానికి ఆ నియోజకవర్గంలో ఏ వీధి ఎక్కడుంది?, ఏ వార్డు కిందకు వస్తుంది?, గ్రామాలు తదితర విషయాలపై అవగాహన శూన్యం. కానీ ఎమ్మెల్యేపై కడుపు మంటతో నిందలు వేసే పనిలో ఉన్నాడు.
సత్య కుమార్.. సీఎం జగన్, కేతిరెడ్డిల పై అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పేరును అసత్య కుమార్‌గా మార్చుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు హితవు పలికారు. నాకు కేంద్రంలో పరపతి ఉంది. ఏమైనా చేయగలను. పీఎం తెలుసు.. సీఎంలు తెలుసు.. కేంద్ర మంత్రులతో టీలు, కాఫీలు తాగుతానని చెప్పుకొనే సత్య తన సొంతూరు ప్రొద్దుటూరుకు ఏమి చేయలేదు. అలాంటి వ్యక్తి ధర్మవరంలో అద్భుతాలు చేస్తానని చెబుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. వెంకయ్య, చంద్రబాబు అండతో వేల కోట్ల రూపాయలు సంపాదించిన సత్య.. నా దగ్గర డబ్బుంది ఓట్లు కొనేసి ఎమ్మెల్యే అయిపోతానని వీర్రవీగుతున్నాడు. కానీ అదంతా జరిగే పనికాదని తెలిసేందుకు ఎక్కువ రోజులు పట్టదు.