ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలను ఆనం కుటుంబం చాలా సంవత్సరాలపాటు శాసించింది. కానీ ఇప్పుడది గత వైభవంగా మిగిలిపోయింది. నేడు కనీసం ఒక్క నియోజకవర్గం కూడా వారి గుప్పిట్లో లేదు. దీనంతటికి రామనారాయణరెడ్డి స్వార్థంతో తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రచారం ఉంది.
ఆనం వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డి నెల్లూరు కేంద్రంగా వివిధ పార్టీల నుంచి రాజకీయాలు నడిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వీరి మాట చెల్లుబాటైంది. కాలం మారిపోయింది. అదే రామనారాయణరెడ్డి ప్రస్తుతం ఆత్మకూరులో తన గెలుపు కోసం వందల గడపలు ఎక్కి దిగుతున్నారు. ఒకప్పుడు ఎంతో మందిని తమ వెంట తిప్పుకొన్న చరిత్ర వారిది. నేడు మాత్రం పాత గొడవలు ఏమైనా ఉంటే మనసులో పెట్టుకోవద్దు. ఆత్మకూరు నియోజకవర్గంలో నాకు సహకరించండి అంటూ బతిమిలాడుకుంటున్న పరిస్థితులున్నాయి. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం గతాన్ని తలుచుకుని బాధ పడుతున్నారంట ఈ కురవృద్ధుడు.
ఆనం రాజకీయ జీవితం ముగిసిపోయిందని అందరూ భావించిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో వెంకటగిరి ఎమ్మెల్యేని చేశారు. అయితే రామనారాయణరెడ్డి మంత్రి పదవి కోసం పేచీ పెట్టారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. మరోసారి చూద్దామన్నారు. అయినా ఆనం మాట వినలేదు. చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతూ వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలతో వైఎస్సార్సీపీ ఆనంను బహిష్కరించింది. దీంతో ఆయన అధికారికంగా టీడీపీ కండువా కప్పుకొన్నారు. తనకు నెల్లూరుకు సిటీ, కుమార్తెకు ఆత్మకూరు సీట్లు అడిగారు. బాబు ససేమిరా అన్నారు. వెంకటగిరికి పోతానన్నారు. అయితే తెలుగుదేశం అధిష్టానం చివరికి ఆత్మకూరును ఆనంకు కేటాయించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన రామనారాయణరెడ్డి తన ఉనికి కోసం బాబు చుట్టూ తిరిగారు. కానీ అనుకున్న సీట్లు దక్కించుకోలేకపోయారు.
ఇదిలా ఉండగా ఆనంకు ఆత్మకూరు టికెట్ ఇవ్వడం ఆ నియోజకవర్గంలోని కమ్మ సామాజికవర్గానికి ఇష్టం లేదు. గతంలో పోటీ చేసిన ఓడిపోయిన కన్నబాబుకు ఇవ్వాలని కోరారు. స్వార్థం కోసం పార్టీలు మారే వ్యక్తికి అవకాశం ఇస్తే ఒప్పుకోమని అధిష్టానానికి తెగేసి చెప్పారు. దీంతో చంద్రబాబు కల్పించుకుని తను చెప్పినట్లుగానే రామనారాయణరెడ్డి జగన్ను తిట్టాడని, ఈ ఒక్కసారికి వదిలేయాలని చెప్పడంతో కొంతమేర శాంతించారు. అదే సమయంలో ఓ మెట్టు దిగి కమ్మ నేతలను కలుపుకొని పోవాలని బాబు ఆనంకు హితవు పలికారు. రాజకీయ భవిష్యత్ కోసం రామనారాయణరెడ్డి ఒకటి కాదు పది, పదిహేను మెట్లు దిగేశారు. కొమ్మి లక్ష్మయ్య నాయుడనే ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ నియోజకవర్గంలో కమ్మ నేతలను ప్రసన్నం చేసుకోవాలంటే ఈయనే దిక్కని ఆనం భావించారు. శుక్రవారం స్వయంగా నెల్లూరులోని కొమ్మి నివాసానికి వెళ్లి సన్మానించి ఆత్మకూరులో తన తరఫున ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన్ను వెంట బెట్టుకుని కమ్మ వర్గం అధికంగా ఉన్న చేజర్ల మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. దీంతో ఆనం మనుషులు చిన్నబోయారు. మా సారుకి ఎలాంటి దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు.
రామనారాయణరెడ్డి గతంలో కాంగ్రెస్ తరఫున ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే సమయంలో ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా. అప్పుడు అధికారం చేతిలో ఉందని విర్రవీగారు. నేతలను తన వద్దకే పిలిపించుకునే వారు. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో చోటా నాయకుల ఇళ్లకు వెళ్లి సపోర్టు అడుగుతున్నారు. అటు వివేకానందరెడ్డి, ఇటు రామనారాయణరెడ్డి పిల్లలకు రాజకీయాల్లో లేరు. ప్రజా బలం ఏ మాత్రం లేదు. వయసు రీత్యా చూస్తే ఆనంకు ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు. ఆ తర్వాత వారి పేరు చరిత్రలోని పేజీల్లోనే ఉంటుంది.