జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ప్రతి ఊరి నుంచి చిన్నాపెద్దా కదిలారు. అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. మండుటెండలను సైతం లెక్క చేయలేదు. సంక్షేమ పథకాలు అందించిన నాయకుడికి సంతోషంగా మద్దతు పలికారు. సమస్యలున్న వారు ఆయనకు చెప్పుకొని పరిష్కారం పొందారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి చేరికలైతే వెల్లువలా జరుగుతున్నాయి. నియోజకవర్గాల ఇన్చార్జిలు, జిల్లాల అధ్యక్షులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుని జగన్‌కు జై కొట్టారు.
మొదట రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలతో జగన్ హోరెత్తించారు. వీటికి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సభలు వందల ఎకరాల ప్రాంగణాల్లో జరిగాయి. ఆ తర్వాత జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. ఓవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలంటూ తిరుగుతున్నా వారి పార్టీల నేతలే సక్రమంగా హాజరుకాని పరిస్థితి ఉంది.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర మాత్రం రాష్ట్ర ప్రజల అభిమానంతో దిగ్విజయంగా సాగుతోంది. ఈ 20 రోజుల్లో 21 జిల్లాల్లో యాత్ర జరిగింది. 67 నియోజకవర్గాలను జగన్ కవర్ చేశారు. 2,015 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా జనం లెక్క చేయకుండా జగనన్నను చూసేందుకు తరలివచ్చారు. ప్రతి జిల్లాలో జరిగిన సభలో జనం కూటమిపై నిప్పులు చెరిగారు. 2014లో వారు అనేక హామీలిచ్చి ఏ విధంగా మోసం చేశారో మేనిఫెస్టోను చూపిస్తూ ఎండగట్టారు. ఐదేళ్ల పాలనలో తాను చేసిన మంచి పనులు, ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే పేదలు ఎంతలా నష్టపోతారో చెప్పారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. దీంతో మూడ్ ఆఫ్ ఏపీ ఏంటో స్పష్టమైపోయింది. జనమంతా జగన్ వైపే ఉన్నారని తేలిపోయింది.