ఎన్నికల ముందు అలివి కాని హామీలను గుప్పించడం టీడీపీకి అలవాటైన పనే. ఆ అలవాటులో భాగంగా 2014 లో బోలెడన్ని హామీలు గుప్పించారు. జనసేన టీడీపీ తో పొత్తు లో ఉండి, టీడీపీ ప్రత్యేక హోదాతో పాటు చిన్నా పెద్ద కలిపి 650 ఇతర హామీలు గుప్పిస్తుంటే బలపరిచింది.
రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించారు. అధికారంలోకి వచ్చాక మీ రుణాలను మేమే చెల్లిస్తామని, ఇప్పుడు అప్పు కట్టకండి అని చెప్పడంతో వీరిని నమ్మిన డ్వాక్రా మహిళలు నిలువునా మోసపోయారు. రుణ మాఫీని అమలు చేయక పోవడంతో మహిళలు వడ్డీ తో సహా రుణాలను చెల్లించాల్సి వచ్చింది.
ప్రత్యేక హోదా సాధించలేదు సరి కదా, దాని గురించి గట్టిగా గొంతుకను కూడా వినిపించలేక పోయారు. చివరికి ప్రత్యేక ప్యాకేజి అంటూ రాష్ట్ర ప్రయోజనాలను నిలువునా పాతేశారు. వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెట్టారు. చివరికి ఎన్నికల మానిఫెస్టోనే వెబ్ సైట్ నుంచి తొలగించి పారేశారు. అధికారంలో ఉన్నన్ని రోజులూ, అమరావతి పేరుతో గ్రాఫిక్ మాయాజాలాన్ని సృష్టించి, ప్రజల దృష్టిని మిగతా విషయాల నుంచి మళ్ళించారు.
ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ఏ ఒక్క హామీనీ అమలు చేయక పోయినా, పవన్ కళ్యాన్ చూసీ చూడనట్టు ఊరుకున్నాడు. ప్రశ్నించడానికే వచ్చానని సభల్లో గొంతు చించుకుని అరిచినా, టీడీపీ హామీల విషయానికి వచ్చే సరికి ఆ గొంతు పెగల్లేదు. మూగదై మాట పడి పోయింది. 2018 లో పొత్తు నుంచి బయటికి వచ్చినా హామీల అమలు పైన పవన్ గొంతు పెద్దగా వినిపించలేదు. తూ తూ మంత్రంగా కొన్ని విమర్శలు చేసినా వాటికి బలం లేక పోయింది.ఈ విమర్శలు కూడా మీడియా ముందు తూతూ మంత్రమే.
2019 లో విడిగా పోటీ చేసి పరువు పోగొట్టుకున్నా, తెర వెనుక కుట్ర దారులిద్దరూ ఒకటే. ఇందుకు సాక్ష్యం, జనసేన బీ ఫారాన్ని పవన్ తన చేతికి ఇచ్చి “నీకు నచ్చిన వాడికి ఇచ్చుకో” అన్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ కుండ బద్దలు కొట్టటమే.
2019 ఎన్నికల తర్వాత వేరే వేరే పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్టు కనిపించినా అది కూడా నాటకమే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు ఏది చేయాలో ఎలా చేయాలో క్లారిటీ గానీ, స్థిరత్వం కానీ లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకునే బలం లేదు. ఏ ఒక్క నాటికీ అతను కానీ అతని పార్టీ గానీ సొంతగ, ఏ పొత్తూ లేకుండా పోటీ చేసే స్థితికి చేరలేరు. అతనికి ఆత్మ విశ్వాసం లేదు.
అందుకే వాటి మధ్య ఊగిసలాడుతూనే మరో పక్క టీడీపీ తో అంటకాగుతుంటాడు. ఒక బలమైన నాయకుడికి ఉండవలసిన లక్షణాలేవీ అతనికి లేవు. వేదిక మీద పూనకాలు తెచ్చుకుని, కొడతా, తంతా వంటి మాటలతో తనను తానే ప్రజల్లో తేలిక చేసుకోవడం అతని ప్రథమ లక్షణం. ఆ పిచ్చి కేకలకు చప్పట్లు కొట్టి ఈలలు వేసే అతగాడి ఫాన్స్ ఎవరూ అతనికి ఓట్లు వేయరనే సంగతి అతను గ్రహించలేక పోతున్నాడు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు మళ్ళీ టీడీపీ జనసేన చేతులు కలిపి, 2014 లో లాగానే అలివి గానీ హామీలు గుప్పించి మరో సారి ప్రజల్ని మోసం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ని కాపీ కొట్టి ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే హామీని కూడా గుప్పిస్తున్నారని అంటున్నారు. ఆ పథకం వల్ల తెలంగాణ లో ఎదురైన పరిస్తితుల్ని చూసినా వీళ్ళిద్దరికీ ఏ మాత్రం అవగాహన ఉండటం లేదు. ఏదో ఒకటి చేసి ఎన్నికలు గెలవాలి, హామీల సంగతి తర్వాత చూద్దాం అనే ధోరణి 2014 నుంచీ ఒంటబట్టించుకున్నారు గా మరి
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల జ్ఞాపకశక్తిని అంత తక్కువగా అంచనా వేస్తే దారుణంగా దెబ్బ తినక తప్పదు. 2014 లో అధికారంలోకి వచ్చాక తమకు ఎంత ద్రోహం చేశారో డ్వాక్రా మహిళలు ఎవరూ మర్చిపోలేదు. వికలాంగులు, వృద్ధులు తాము పించను కోసం పడిన కష్టాలూ మర్చిపోలేదు.
వీళ్ల కుట్రకు ఓటుతో జనం చెప్పు దెబ్బ వంటి జవాబు చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు