సకల వసతులతో ఐదు ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తయ్యాయి, పన్నెండు ఆసుపత్రులు మరో రెండేళ్లలో పూర్తి కాబోతున్నాయి; దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది; రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా విలేజ్ క్లినిక్కులు ప్రారంభమయ్యాయి; ‘నాడు – నేడు’ కింద దాదాపు పన్నెండువేల ఆసుపత్రుల రూపురేఖల మారాయి; 58 వేల వైద్య సిబ్బంది నియామకం జరిగింది; ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష వంటి పథకాలు విజయవంతంగా నడుస్తున్నాయి.
‘ఆరోగ్య శ్రీ’ కార్డు ఉన్న వారికి అవసరాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ఏ ప్రైవేటు ఆసుపత్రిలో అయినా ‘ఆరోగ్య శ్రీ’ ద్వారా 25 లక్షల రూపాయల వరకు చికిత్స చేయించుకునే సౌలభ్యం కలిగింది.
ఇదీ …వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, వారి అనుకూల మీడియా ‘రాష్ట్రంలో అభివృద్ధి లేదు, లేదు’ అంటూ హోరెత్తిస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మే చదువుకున్న నిరక్షరాస్యులకు తప్ప రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతంలో సామాన్యులకు కళ్ల ముందు కనిపిస్తూన్న మార్పు.
అదే గత ప్రభుత్వ హయాంలో …
2016-17 లో ఎకరా యాభై లక్షల నుంచి నాలుగుకోట్ల రూపాయల మధ్య ధరకు ఇండో యూకే హాస్పిటల్ కోసం నూట యాభై, బీఆర్ శెట్టి మెడికల్ కాలేజీ కోసం వంద, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కోసం పదకొండు, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి కోసం పన్నెండున్నర, కిమ్స్ ఆసుపత్రి కోసం నలభై ఎకరాల భూమిని అమ్మాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్దేశిత సమయంలో పనులేవీ చేయలేదని ప్రస్తుత ప్రభుత్వం ఇండో యూకే హాస్పిటల్ భూ కేటాయింపును రద్దు చేసింది(కాగ్ రిపోర్టులో కూడా ఈ విషయం ఉంది). బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి తప్ప మిగతా ఆసుపత్రుల ఏర్పాటు ఏ దశల్లో ఉన్నాయో కూడా తెలీదు.
కానీ ప్రస్తుత ప్రభుత్వం – పేదల కోసం జిల్లాకొక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలనే లక్ష్యంతో వాటికి అవసరమైన అనుమతుల నుంచి వాటిని పూర్తి చేసి ఆరంభించడం వరకు ఎక్కడా రాజీ పడకుండా చిత్తశుద్ధితో పని చేస్తోంది. కానీ గత ప్రభుత్వం – కేవలం కొందరు మాత్రమే భరించగల ప్రైవేటు ఆసుపత్రుల(బసవతరకం క్యాన్సర్ ఆసుపత్రి మినహా) కోసం, అవి కూడా అమరావతిలో మాత్రమే ఏర్పాటయ్యేలా చూపించిన చొరవలో పదో వంతు కూడా ప్రభుత్వ వైద్య రంగం పట్ల చూపించలేదు. ఈ తేడాను అర్ధం చేసుకోగలిగిన వారెవరికైనా – 2024 లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని ‘పేదలకు, పెత్తందారులకు మధ్య జరగబోయే యుద్ధం’గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పేర్కొన్నారో స్పష్టంగా అర్ధమవుతుంది.
పేదలకు మాత్రమే కాదు … జేబులు గుల్ల చేసే ప్రైవేటు ఆసుపత్రులకు కాకుండా ఉచితంగా వైద్యం చేయించుకునేందుకు సకల సౌకర్యాలతో మాకు ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రులున్నాయనే ధైర్యం రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి కలగాలంటే మళ్లీ జగనే రావాలని మెజారిటీ ప్రజల అభిలాషగా ఉండటానికి కారణం ఇదే .
– రావూరి