ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన క్రీడా సంబరాల ముగింపు వేడుకలో పాల్గొని విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలను సీఎం వైయస్ జగన్ అందించనున్నారు.
నేడు విశాఖపట్నంలోని డా.వైయస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరిగిన ఈ మెగా టోర్నీలో మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు పాల్గొనగా వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లను అందించిన ప్రభుత్వం, ఇకపై ప్రతీ సంవత్సరం ఆడుదాం ఆంధ్ర టోర్నీని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేలా ఆదేశాలిచ్చింది. కాగా విజేతలుగా నిలిచినవారికి రూ.12.21 కోట్ల నగదు బహుమతులను ప్రభుత్వం అందించనుంది.
క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా మొదటి స్థానంలో నిలిచిన జట్లకు రూ.5 లక్షలు, రెండో స్థానంలో నిలిచిన జట్లకు రూ.3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన జట్లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనుండగా, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు రూ.2 లక్షలు,రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, మూడో స్థానంలో నిలిచిన విజేతలకు రూ.50 వేల బహుమతి లభించనుంది.
ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించగా, వివిధ క్రీడల్లో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర మెగా టోర్నీ విజయవంతం కావడంతో గ్రామాల్లో దాగి ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రతీ సంవత్సరం ఆడుదాం ఆంధ్ర టోర్నీ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
కాగా ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ నేటి సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడ పీఎం పాలెం వైఎస్సార్ క్రికెట్ స్టేడియంకు చేరుకుని క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించిన తర్వాత విజేతలకు బహుమతులు ప్రధానం చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు. ముఖ్యమంత్రి విశాఖ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.