2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంది అంటూ యాక్టర్ రఘు బాబు పొగడ్తలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముంచెత్తారు. తెలుగు నేలకి తేజస్సు వచ్చింది, గతంకి ఇప్పటికి చాలా మార్పులు గమనిoచానని ఈ సందర్భంగా తెలిపారు.
యాక్టర్ రఘుబాబు తన సొంతూరైన ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంకి వచ్చినప్పుడు మీడియాతో ముచ్చటించారు. జగన్ పరిపాలన ఈ స్థాయిలో ఉంటుందని గత ఎన్నికల ముందు నేను ఏమాత్రం ఊహించలేదు, రాష్ట్రంలో మూలాల నుంచి మార్పును జగన్ కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూస్తుంటే కార్పొరేట్ స్కూల్స్ గుర్తుకొస్తున్నాయి, ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదవడం అంటే అవమానంగా భావించేవారు. ఆ దశ పోయి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదని బోర్డులు పెట్టడం అంటే వాటి గొప్పతనం తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు మారడంతో గతంలో 20, 30 శాతం కూడా విద్యార్థులు కనిపించని పరిస్థితి నుంచి ఇప్పుడు నూరు శాతం ఆక్యుపెన్సిని గమనించాను అని తెలిపారు.
తాను ప్రస్తుతం రాజకీయాల్లో లేనని , ఏ పార్టీతోను ఎటువంటి సంబంధాలు లేవని ఏ అవసరం కోసమైనా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలలో అనేక మార్పులు తీసుకొచ్చారు అవి మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయన్నారు. గ్రామ సచివాలయం కావచ్చు, వాలంటర్లు ఇళ్లకు రావడం, విలేజ్ హెల్త్ క్లినిక్, డాక్టర్ ఇంటి దగ్గరికి వచ్చి చూడడం, ప్రభుత్వ పథకాలు ప్రతిదీ ఇంటికి తీసుకొచ్చి అందించడం గొప్పగా అనిపిస్తుంది అని అన్నారు. ఇక్కడ మా ఇంట్లో పనిచేసే పని వాళ్ళ పిల్లలు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని ఉపయోగించుకొని దర్జాగా రాజమండ్రి లోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోగలుగుతున్నారు, మేము వారికి చేసే పనికి జీతాలు ఇచ్చినా .. అడపాదడపా అదనంగా ఆర్థిక సాయం చేసినా కూడా వాళ్ళు ఆ స్థాయి లాంటి కాలేజీలో చదువుకోలేరు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల వాళ్ల జీవితాలు మారిపోతున్నాయి. పిల్లలు బాగా చదువుకోగలడం వల్ల ఎన్నడు చూడనంత ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. ఇది మాకు చాలా ఆనందాన్ని అందిస్తోంది. ఈ పథకాలు ఇలాగే కొనసాగాలని, ఈ పాలన పేదలకు మరింతకాలం మేలు కలుగజేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.