ఏబీఎన్ రాధాకృష్ణ అలియాస్ ఆర్కే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి విషయంలో ఒక్కోసారి నిజాలు భలే చెప్పేస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్, వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయంలో మాత్రం అబద్ధాలు ప్రచారం చేసే ఆర్కే తన యజమాని నారా వారి విషయంలో అప్పుడప్పుడు వాస్తవాలను నోరు జారుతుంటారు. నేను మంచి కోరే విమర్శలు చేస్తున్నానని ఆర్కే అనుకుంటారు కానీ అవన్నీ టీడీపీ మెడకు చుట్టుకుంటున్నాయి.
తాజా కొత్తపలుకులో ఆర్కే ఇలా అన్నారు. ‘చంద్రబాబు మండుటెండలను సైతం లెక్క చేయకుండా, ముఖంలో అలసట కనిపించనీయకుండా రోజుకు మూడుచోట్ల సభలు నిర్వహిస్తున్నారు. యువకుడినైన తనకు ముసలోడితో పోటీ ఏంటని ఎద్దేవా చేసే సీఎం జగన్ మాత్రం రోజుకు ఒక మీటింగ్‌తో సరిపెడుతున్నారు. అది కూడా సాయంత్రం పూట ఎండ వేడి తగ్గాక బయటకు వస్తున్నారు.
‘చంద్రబాబుకు ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. వయోభారం రీత్యా విజయం సాధించడం ఆయనకు చాలా అవసరం. గెలిచి అధికారంలోకి రాకపోతే బాబు రాజకీయ జీవితం ఓటమితో ముగిసే ప్రమాదముంది’ ఇవి కూడా ఆర్కే వ్యాఖ్యలే. బాబు వృద్దుడైపోయాడని, ఇవే చివరి ఎన్నికలని ఆయన చెప్పకనే చెప్పారు. ఎన్నికలన్నాక ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. టీడీపీ ఓడిపోతుందనే భయంతో ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేసేందుకు నారా వారు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. ఒకచోటేమో ఈ వృద్ధుడు ఎండలను సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నాడని.. మరోసారి రాజకీయ జీవితం ముగిసిపోతుందనే భయంతో తిరుగుతున్నాడని చెప్పుకొచ్చారు ఆర్కే.
జగన్ ఐదు సంవత్సరాలపాటు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా అర్హులందరికీ నేరుగా డబ్బు అందింది. అవినీతికి తావు లేదు. పరిశ్రమలు తెచ్చారు. విద్యారంగంలో మార్పులు వచ్చాయి. వైద్యరంగాన్ని బలోపేతం చేశారు. రైతులను ఆదుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. చంద్రబాబు జీవితంలో చెప్పుకోదగిన పథకం ఒక్కటీ లేదు. పైగా అమరావతి పేరుతో దోచుకున్నాడు. అందువల్లే ఓడిపోతానని భయంతో కనిపించిన వారిందరికీ ఒంగి ఒంగి దండాలు పెడుతూ తిరిగేస్తుంటే.. యువకుడైన జగన్ తిరగడం లేదని చెబితే ఎలా రాధాకృష్ణా.. సరే మీ లెక్క ప్రకారం బాబు ఫిట్‌గా ఉన్నాడు. ఎండలు సైతం లెక్క చేయకుండా తిరిగేస్తున్నాడు అనుకుందాం. మరి స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మొదట ఏమని చెప్పి బెయిల్ తీసుకున్నాడు. నారా వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. గుండె సంబంధిత వ్యాధులున్నాయి. బాడీలో ప్రతి పార్ట్‌కు ఏదో ఒక జబ్బు ఉందనే కదా.. అంటే ఆనాడు బెయిల్ కోసం అబద్ధాలు చెప్పారా..
జగన్ సిద్ధం సభలతో హోరెత్తించారు. ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. జిల్లాకు ఒక భారీ సభ పెడుతున్నారు. అక్కడికే అందరు అభ్యర్థులను పిలిపించి పరిచయం చేస్తున్నారు. ప్రజలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. కానీ బాబు ఇరుకు వీధుల్లోనే కదా చిన్న సభలు పెట్టి బిల్డప్ ఇస్తున్నారు. టీడీపీ కోసం ఆర్కే తన పెన్నును ఎటు పడితే అటు తిప్పేస్తున్నారు. అది సరైన దారిలో తిరగడం లేదు. బాబునే చిక్కుల్లో పడేస్తోంది.