‘ఆడుదాం.. ఆంధ్రా’. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద క్రీడా సంబరం. దాదాపు 50 రోజులపాటు జరిగే క్రీడా వేడుక ఇది. గతేడాదిలో ప్రజాప్రతినిధులు క్రీడా సామగ్రిని అందించారు. తొలి విడతలో గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
ప్రతిభ ఉండి.. సరైన ప్రోత్సాహం లేక ఎంతో మంది క్రీడల్లో ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ క్రమంలో వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఆడుదాం.. ఆంధ్రా పేరుతో క్రీడా పోటీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. సచివాలయాల పరిధిలో స్త్రీ, పురుషులను వేర్వేరు జట్లుగా విభజించి పోటీలను జరిపారు. వాలీబాల్ జట్టులో 12, ఖోఖో జట్టులో 15, క్రికెట్ జట్టులో 16, బ్యాడ్మింటన్లో ఇద్దరు చొప్పున క్రీడాకారులు ఉండేలా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. పోటీల్లో గ్రామ స్థాయి ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. నిబంధనల మేరకు కనిష్ట వయసు 15 ఏళ్లు కాగా.. గరిష్టంగా ఎంతైనా ఉండొచ్చు. పేర్లు నమోదు చేసుకున్న వారిని జట్లుగా విభజించి.. వారికి ఏ పోటీలను ఎప్పుడు నిర్వహించేది.. తేదీ.. సమయాన్ని తెలియజేసే రసీదులను అందించారు. జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు, పీడీలు, ఈఓపీఆర్డీలు, పీఈటీలను పరిశీలన నిమిత్తం నియమించారు.
నగదు ప్రోత్సాహకాలు
నియోజకవర్గ స్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులుగా రూ.20 వేలు, రూ.పది వేలను అందజేస్తారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులుగా రూ.లక్ష, రూ.50 వేలను ఇవ్వనున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులుగా రూ.5 లక్షలు, రూ.3 లక్షలను అందజేయనున్నారు.
తొలిదశ హైలెట్స్
– సచివాలయ స్థాయిలో 1.68 మ్యాచ్లను నిర్వహించారు.
– మహిళలు, పురుషులకు కలిపి క్రికెట్ మ్యాచ్లు 40,856, బ్యాడ్మింటన్ 58,424, వాలీబాల్ 24,145, కబడ్డీ 25,751, ఖోఖో 19,635 మ్యాచ్లు జరిగాయి.
ఎల్లో మీడియా ఎన్ని చెప్పినా..
ఆడుదాం ఆంధ్రాపై కూడా ఎల్లో మీడియా విషం కక్కింది. స్పందన లేదని రాసింది. అయితే ఈ మెగా టోర్నీకి అందరూ బ్రహ్మరథం పట్టారు. దీంతో బుధవారం నుంచి రెండో విడత మండల స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు క్రీడాకారులను ప్రోత్సహించిన పాపాన పోలేదు. ఒలింపిక్స్ నిర్వహిస్తామంటూ మాట్లాడి నవ్వుల పాలయ్యారు. పీవీ సింధూకు మెడల్ వస్తే తన వల్లేనంటూ డబ్బా కొట్టుకున్నారు.
– వీకే..