తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంబంధం లేని విషయాల్లో క్రెడిట్ తీసుకోవడంలో ముందుంటారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రజలకు మేలు జరిగితే చాలు.. నాకు క్రెడిట్ అవసరం లేదని దూరంగా ఉంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరిగినా ఎల్లో గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటుంది. పరిశ్రమలు రాలేదని, యువతకు ఉపాధి కల్పించలేదని ఊదరగొడుతూనే ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో డోస్ మరింత పెంచింది. కానీ అనుకున్న సమయానికంటే ఆరునెలల ముందే ఓ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించింది. అది ఏ రూ.10 కోట్లో.. రూ.20 కోట్లతో ఏర్పాటు చేసింది కాదు. దాని పెట్టుబడుల విలువ రూ.2,500 కోట్లు. వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా దాచేపల్లిలో శ్రీ సిమెంట్ లిమిటెడ్ మంగళవారం తన కొత్త ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌ను ప్రారంభించింది. షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే ఈ రూ.2,500 కోట్ల విలువైన ప్లాంట్‌ను మొదలుపెట్టడం విశేషం. దీని వల్ల రెండు వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 2021లోనే ఈ భారీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. అప్పట్లో సీఎం జగన్‌తో శ్రీ సిమెంట్ గ్రూప్ ప్రతినిధులు సమావేశమై తమ అంగీకారం తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆనాడు జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సంస్థ ఎండీ హెచ్ఎం బంగూర్ ప్రశంసించారు. ఆయన చిత్తశుద్ధిని కొనియాడారు.
కొత్త ప్లాంట్ ప్రారంభం సందర్భంగా కంపెనీ పలు వివరాలను వెల్లడించింది. వారికి మన దేశంలోనే కాకుండా యూఏఈలోనూ ప్లాంట్లు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి దాచేపల్లిలో ఏర్పాటు చేసింది ఉపయోగపడుతుంది. సదరు సంస్థకు దేశంలో ఐదు ప్లాంట్లు ఉన్నాయి. దాచేపల్లిలో పెట్టింది ఆరో ఇంటిగ్రేటెడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీ. కర్ణాటక తర్వాత దక్షిణాదిలో రెండో అతిపెద్ద ప్లాంట్ ఇది. సంవత్సరానికి మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పెట్టారు. దీనితో సంస్థ ఉత్పత్తి సామర్థ్యం మొత్తంగా 56.4 మిలియన్లకు చేరుతుంది.
జగన్ ప్రభుత్వ ఆదేశాలతో కాలుష్యం వెలువడకుండా పర్యావరణ పరిరక్షణకు సంస్థ పెద్దపీట వేసింది. మున్సిపల్, బయోమాస్ వంటి వ్యర్థాలను 30 శాతం మేర వినియోగించుకునేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. జీరో వేస్టేజ్‌పై దృష్టి సారించారు. వర్షపునీటి ఒడిసి పట్టుకుని వాడుకునేలా ఏర్పాట్లు చేశారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటంతా కాగితాలపైనే ఉండేది. ఎల్లో మీడియా అదొస్తోంది.. ఇదొస్తోందని డబ్బా కొట్టేది. కానీ టీడీపీ ఉన్న ఐదేళ్లలో జరిగిన పారిశ్రామికాభివృద్ధి అంతంతమాత్రమే. కానీ జగన్ అలా కాదు. సీఎం అయిన నాటి నుంచే పరిశ్రమల విషయంపై వర్క్ చేశారు. దాని ఫలితాలను నేడు చూస్తున్నాం.