టీడీపీ జనసేన అధిష్టానం పొత్తుతో ఎన్నికల బరిలో దిగబోతున్నాం అని చెబుతుంటే.. కింది స్థాయిలో నాయకులు కార్యకర్తలు మాత్రం నిత్యం గొడవలకు దిగుతున్నారు. టీడీపీ జనసేన పార్టీలలో నాయకులు కార్యకర్తల మధ్య ఆధిపత్యపోరు తో పాటు సీట్ల విషయంలో మొదలైన తగాదాలు ఫ్లెక్సీల వరకూ వచ్చాయి.. పొత్తులో ఉన్నప్పటికీ ఒకరి ఫ్లెక్సీలను మరొకరు చింపుకోవడం లాంటివి సర్వ సాధారణం అయిపోయాయి .
నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరులో రాకదలిరా కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు పాల్గొనే సందర్భంలో టీడీపీ వర్గం వారు జనసేన నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారి ఫ్లెక్సీలు మాత్రమే ఉండాలని ఇతరుల కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సహించేదిలేదని చెప్పడంతో జనసేన కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అలా టీడీపీ వర్గం జనసేనను పొత్తుకు మాత్రమే వాడుకుంటూ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కూడా పెట్టనివ్వకపోవడంపై జనసేన కార్యకర్తలు గొడవ మొదలుపెట్టారు. రెండు సామాజిక వర్గాలకు మధ్య గొడవ పెరగడంతో చేబ్రోలు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరుపార్టీలకు చెందిన వారిని అక్కడ నుంచి పంపించేశారు.
అయితే గొడవ అక్కడితో సద్దమనగలేదు.. ఎన్నికల ప్రచారం లో భాగంగా జరగబోయే తరువాతి సభలలో తమ నాయకుడికి సరైన గౌరవం కల్పించకపోతే ఊరుకునేదిలేదంటూ జనసేన వర్గాలు వార్నింగులు ఇస్తున్నాయి.. వడ్లమూడిలో జరిగే చంద్రబాబు సభకు సంబంధించిన టీడీపీ బీసీ నేతకు చెందిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడాన్ని కూడా స్థానిక టీడీపీ నేతలు అడ్డుకోవడంపై ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల ఇదేవిధంగా టీడీపీ జనసేన వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇరు పార్టీల కార్యకర్తలు కొట్లాటలకు దిగుతున్నారు. టీడీపీ జనసేన పార్టీల మీటింగులు జరిగే ప్రదేశాలలో పెద్ద ఎత్తున పోలీసులు కాపలా కాయాల్సి వస్తోంది.