బెంగుళూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్ ఫీల్డ్ పరిధిలోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్ లో ఈ ఏడాది మార్చ్ 1వ తారీఖున బాంబు పేలుడు సంభవించి సుమారు 10 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడు వెనకాల ఉగ్ర కుట్ర ఉందని పోలీసు దర్యాప్తులో తేలింది. కేసును చేధిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) తాజాగా కేసు విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ లోని రాయదుర్గానికి రావడం సంచలనంగా మారింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు మంగళవారం తెల్లవారుజామున వేణుగోపాలస్వామి గుడి వీధిలోగల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా ఇంట్లో సోదాలు నిర్వహించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన కుమారుడు సోహెల్ ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకెళ్లినట్టు సమాచారం. సోహెల్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో ఎన్ఐఎ అధికారులు రాయదుర్గంలో తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది ఆయన ఫోన్ కాల్ డేటాను పరిశీలించిన అనంతరం అదుపులోకి తీసుకునట్టు సమాచారం.
సోహెల్ బెంగళూరులో ఉన్నప్పుడు ఉగ్రవాదులు ఆయన ఫోన్ ను ఉపయోగించినట్లు ఎస్ఐఏ అధికారులు అనుమావిస్తున్నారు. బెంగుళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులను పశ్చిమ బెంగాల్లో ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.