వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ : పదేళ్ల ఎన్డీయే పాలన పురోగతి గురించి వివరించడమే ప్రాధాన్యత..
Budget : మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర శృష్టించింది నిర్మలా సీతారామన్. అయితే ఈ మద్యంతర బడ్జెట్ (Budget) రానున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నాందిలా భావించొచ్చు. ఈ పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయట పడేశామని, 2047 నాటికి భారత్ ను వికసిత్ భారత్ గా మార్చబోతున్నామని, యువతను, రైతులను, పేదలను, మహిళలను మరింత శక్తివంతం చేయబోతున్నామని ప్రకటించుకుంది. తమ మీద తమకున్న ఆత్మవిశ్వాసం కావొచ్చు, లేదా కాంగ్రెస్ వారిపై వారికున్న నమ్మకం కావొచ్చు, బడ్జెట్ సమావేశాల్లో ఎక్కడా తొణుకు-బెనుకు లేకుండా, చాలా కాన్ఫిడెంట్ గా కనపడింది పార్లమెంట్ లో మోడీ అండ్ కో..
అయితే వాటిపై అన్ని దినపత్రికల్లో వివిధ రకాల కథనాలు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటాం.. కాబట్టి ముందుగా మనం బడ్జెట్ యొక్క పదజాలానికి అర్ధం ఏమిటి? బడ్జెట్ లో ఖర్చు, ఆదాయం ఎలా లెక్కేస్తారు వంటి అంశాలపై కాస్త దృష్టి పెడదాం:
బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే:
మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు కాగా :
ఈ 47.65 కోట్లు ఏవిధంగా పొందుతారంటే:
I. రెవిన్యూ వసూళ్లు: ప్రభుత్వం చేసే సేవలకు గానూ ప్రభుత్వం పొందే ఆదాయం. ఇది రెండు రకాలు
1.పన్నుల ద్వారా వచ్చే ఆదాయం: ఇది 26,01,574 కోట్లు.
2.పన్నేతర ఆదాయం: ఫీజుల ద్వారా, అమ్మకాల, ఫైన్ ల ద్వారా, మొదలగు వాటి ద్వారా వచ్చే ఆదాయం : ఇది 3,99,701
మొత్తం రెవిన్యూ వసూళ్లు: 30,01,275 కోట్లు
II. మూలధన వసూళ్లు: ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి నుండి వచ్చే లాభాలు, ఇచ్చిన రుణాల యొక్క వడ్డీలు, ప్రభుత్వం చేసే అప్పులు మొదలగు వాటి నుండి వచ్చే ఆదాయం.
రుణాల రికవరీ ద్వారా: 29,000 కోట్లు
ఇతర వసూళ్ల ద్వారా: 50,000 కోట్లు
అప్పుల ద్వారా: 16,85,494 కోట్లు
మొత్తం గా మూలధన వసూళ్లు 17,64,494 కోట్లు..
రెవిన్యూ వసూళ్లు(30,01,275 కోట్లు)+మూలధన వసూళ్లు(17,64,494 కోట్లు) = 47,65,768 కోట్లు మన మొత్తం బడ్జెట్ అంకెలు అన్నమాట.. దీన్ని ఎలా ఖర్చు చేస్తాం అనేదే బడ్జెట్ ..
అయితే రెవిన్యూ లోటు అనీ, ద్రవ్య లోటు అనీ, ప్రాథమిక లోటు అని వింటుంటాం.. వాటర్థం:
రెవిన్యూ లోటు: ప్రభుత్వ రోజువారీ పాలనలో ప్రభుత్వం చేసే ఖర్చు కన్నా ఆ ఖర్చు నుండి వచ్చే ఆదాయం తక్కువ గా ఉంటే అది రెవిన్యూ లోటు: ఇది ఎప్పుడు ఉంటుంది. దీన్ని తగ్గించాలనే ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. ప్రస్తుత రెవిన్యూ లోటు- 6,53,383 కోట్లు..
అనగా ప్రభుత్వానికి తమ సర్వీసుల ద్వారా వస్తున్న ఆదాయం కన్నా తాము ఖర్చు చేసే ఆదాయం 6,53,383 కోట్లు ఎక్కువ..
ద్రవ్య లోటు: ప్రభుత్వం చేయబోతున్న మొత్తం వ్యయం కన్నా ప్రభుత్వానికి వస్తున్న మొత్తం ఆదాయం ఎంత తక్కువ ఉందో అదే ద్రవ్య లోటు. అనగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వం చేయబోయే ఖర్చుకు కొత్తగా తీసుకోబోయే అప్పు అని భావించొచ్చు.. ప్రస్తుత ద్రవ్య లోటు: 16,85,494 కోట్లు ఇది మూలధన వసూళ్ళలో అప్పులకి సమానం గా ఉంది..
ప్రాథమిక లోటు: ప్రభుత్వం గతం లో చేసిన అప్పులకు వడ్డీలను మినహాయిస్తే కొత్తగా చేయాల్సిన అప్పు అనగా వడ్డీల భారం లేకపోయి ఉంటే మనకి ఎంత అప్పు తీసుకుంటే సరిపోతుందో అదే ప్రాథమిక లోటు. అనగా ప్రాథమిక లోటు = ద్రవ్య లోటు – గతం లో చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులు..
బడ్జెట్ లో ముఖ్యాంశాల విషయానికి వస్తే:
GYAN పద్దు: గరీబ్, యువ,అన్నదాత, నారీ నాలుగు వర్గాలే ప్రాధాన్యం గా ముందుకు సాగుతున్నాం అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కోటి ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ లు అమర్చడం వల్ల ఉచిత విద్యుత్ అందించబోతున్నట్లు ప్రకటించారు..
వ్యవసాయ విభాగానికి 1.27 లక్షల కోట్లు కేటాయించారు కాగా ఆహార మంత్రిత్వ శాఖకు కోతలు విధించారు.
ప్రజాపంపిణీ వ్యవస్థ కు 8 వేల కోట్ల తగ్గింపు జరిగింది కాబట్టి కోవిడ్-19 నుండి PDS ద్వారా అందిస్తున్న అదనపు లబ్ధి ని కుదించే అవకాశాలున్నాయి..
పీఎం కిసాన్ నిధికి మళ్లీ గతేడాదిలాగే 60 వేల కోట్లనే కేటాయించారు కాబట్టి రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయంలో ఎటువంటి పెరుగుదల ఉండదు అనేది ప్రస్ఫుటం..
ఆదాయపు పన్ను శ్లాబులలో ఎలాంటి మార్పులూ చేయలేదు. మద్యంతర బడ్జెట్ కాబట్టి ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులు చేయదలేదని సమర్థించుకునే ప్రయత్నం జరుగింది. దీనితో పాత పన్ను విధానంలోనే కొనసాగే వారికి ఎలాంటి లబ్ధి చేకూరటం లేదని విమర్శ ఎదురవుతుంది..
ఇక అత్యధికంగా రక్షణ రంగానికి 6.21 కోట్లు కేటాయించారు, అమెరికా చైనా తర్వాత రక్షణ రంగం పై అత్యధికంగా ఖర్చు చేసే దేశం గా భారత్ గత కొన్నేళ్లుగా మూడో స్థానంలో ఉండనే ఉంది..
ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే..
ఈ మద్యంతర బడ్జెట్ ఎప్పటిలానే నిరాశ పరిచింది..
ఎప్పటిలాగానే విభజన హామీల ఊసు లేకుండానే ముగిసింది.
పోలవరం కేటాయింపుల ఊసే లేదు,
నదుల అనుసంధానం పై గత కొన్నేళ్లుగా కేంద్రం బాగానే దృష్టి సారించింది, ఈ బడ్జెట్ లో కూడా బాగానే కేటాయింపులు చేసింది. కానీ వాటిలో కూడా తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపించింది..
కాకపోతే రైల్వే బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్రానికి కాస్త ఊరట అనే చెప్పుకోవాలి, ఈ బడ్జెట్ లో ఏపి కి 9,138 కోట్లు కేటాయింపు జరిగింది. విశాఖ రైల్వే జోన్ గురించి ఏపీ ప్రభుత్వం తో కలిసి పని చేస్తున్నాం అని అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.. ఇది కాస్త సానుకూలాంశం..