‘రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటా. వైఎస్సార్ కాంగ్రెస్‌తోనే నా పయనం. దీంట్లోనే ఉంటా తప్పితే వేరే పార్టీకి వెళ్లను. అవసరమైతే రాజకీయాలు విరమించుకుంటా’ గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్పిన మాటలివి. ఆ సమయంలో యాంకర్ మొత్తం రికార్డు అయ్యిందని చెప్పగా.. రికార్డు అవుతుందనే స్పష్టంగా మాట్లాడాను. ఇది పర్మినెంట్ డాక్యుమెంట్. వైఎస్సార్సీపీకి నేను పర్మినెంట్ అన్నారు వసంత.
నేడు అవకాశవాద రాజకీయాలకు వసంత కేరాఫ్‌గా మారిపోయారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆయన ‘ఏపీకి పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు టీడీపీతోనే సాధ్యం. నా నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోలేదు. ఇప్పటికే టీడీపీలో ఉన్న నాయకులతో కలిసి పనిచేస్తా. నేను వెళ్లి పెత్తనం చేయను. వారి నాయకత్వంలోనే ముందుకు సాగుతా’ అన్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడిన వసంత.. గతేడాది నవంబర్‌లో రెడ్డిగూడెంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల నియోజకవర్గంలో రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేసి వివిధ పనులు చేశామని వెల్లడించారు.
వాస్తవానికి జగన్ ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి మైలవరం టికెట్‌ను బీసీకి ఇవ్వాలని నిర్ణయించారు. సమన్వయకర్తగా జెడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్‌ను నియమించారు. అంతే.. వసంతలోని పెత్తందారు నిద్ర లేచాడు. వెనుకబడిన వర్గాలకు అవకాశం ఇస్తే సహించేది లేదని చంద్రబాబుకు టచ్‌లోకి వెళ్లారు. ఆయన కూడా వసంత తిట్టిన తిట్లను తుడిచేసుకుని.. దేవినేని ఉమాను కరివేపాకులా తీసిపాడేసి వచ్చేయ్ అన్నారు.
వసంత మైలవరం టీడీపీలో చిచ్చు రేపారు. ఆయన్నుS తీసుకోవద్దని నేతలు, ముఖ్యంగా దేవినేని ఉమా డిమాండ్ చేస్తూ వచ్చారు. నేరు బాబును కలిసి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి కారణాలు లేకపోలేదు. గతంలో కృష్ణప్రసాద్ పలు సందర్భాల్లో ‘తెలుగుదేశానికి నారా లోకేశ్ పెనుభారం. అతనితో పైసా ప్రయోజనం ఉండదు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు టీడీపీని ఎలా దొంగిలించాడో అదే రీతిలో ఉమా కబ్జాల సంస్కృతి నేర్చుకున్నాడు. ఆయన అబద్ధాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. ఉమా మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకున్నాడు. టీడీపీ దొంగల పార్టీ. బాబు హయాంలోనే అక్రమ మైనింగ్ జరిగింది. చిల్లర రాజకీయాలు చేయడంలో ఉమా దిట్ట. చంద్రబాబు ప్రవాస నేత’ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా చాలా అన్నాడు. దీంతో ఈయన స్వార్థపరుడని, తీసుకుంటే మేమంతా పనిచేసేది తెలుగు తమ్ముళ్లు తెగేసి చెప్పినా బాబు వినలేదు. వసంతకు కండువా కప్పేశారు. ఇదే సమయంలో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దేవినేని ఉమాకు ఇక టికెట్ లేనట్లేనని ఎల్లో మీడియా కూడా నిర్ధారించింది. దీంతో ఆయన వర్గం వసంతకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
నాయకుడంటే ఇచ్చిన మాటపై నిలబడాలి. కానీ వసంతకు అవేమీ తెలియదు. రాజకీయాల్లో తాము మాత్రమే ఎదగాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు దక్కకూడదనే మనస్తత్వంతో ఉన్నారు. అందుకే తిట్టిన నోటితోనే నేడు ఎల్లో గ్యాంగ్‌ను పొగుడుతున్నారు. ఐదేళ్లపాటు మైలవరం నియోజకవర్గానికి మంచి చేసిన జగన్‌పై అభాండాలు వేస్తున్నారు. ఇలాంటి వారికి రాజకీయ భవిష్యత్ ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు చెప్పాడు కదా అని ఉమా వసంతతో కలిసి పనిచేయడు. ఇప్పటికే ఉన్న నేతలతో కలిసి ముందుకు సాగుతానన్న కృష్ణ ప్రసాద్ మాటలు నీటి మూటలే. ఎందుకంటే వసంత, దేవినేని కుటుంబాల మధ్య వైరం చాలా కాలంగా ఉంది. వారి మధ్య తెలుగు తమ్ముళ్లు నలిగిపోనున్నారు. మొత్తంగా చంద్రబాబు నిర్ణయం వల్ల మైలవరంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.