పారిశ్రామిక అభివృద్ది అనేది కాలంతో పాటు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కో అధ్యాయంలో మారుతున్న కాలాన్ని బట్టి పారిశ్రామికంగా మరింత ముందు అడుగువేయడానికి కొత్త పాలసీలు సృష్టించబడుతాయి. ఆ విధానాలు సమాజంపై సత్ఫలితాలు వచ్చినా దుష్ఫలితాలు వచ్చినా ఆ పాలసీలు తయారు చేసిన వాళ్ళు మాత్రమే భాద్యులౌతారు.. ఇది ప్రాధమిక సూత్రం. కానీ మాన రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి మనం దశాబ్ధాలుగా వింటూనే వస్తున్నాం. అదేమిటంటే రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అందుకు నేనే కారణం అంటారు చంద్రబాబు. మరీ ముఖ్యంగా ఐటీ విషయంలో అయితే నేనే ఐటీ పిఠామహున్ని అంటాడు ఆయన . నిజంగానే రాష్ట్రంలో ఐటీ అభివృద్ది చెందడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడేనా?
తెల్లారి కోడి కూసింది మొదలు ప్రపంచానికి నేనే ఐటీని పరిచయం చేశానని చెప్పుకునే చంద్రబాబు కనీసం హైద్రబాద్ ఐటీ పునాదుల్లో కూడా లేడని ఎంత మందికి తెలుసు ?… గత పాలకుల కృషిని పాతిపెట్టి తానే అన్నిటికి ఆధ్యుడినని చెప్పుకు తిరిగే ప్రచార సామ్రాట్ అని ఎంతమందికి తెలుసు? ఆ చరిత్ర తెలియని వాళ్ల కోసం, ఒక వర్గ మీడియా చెప్పిన తప్పుడు చరిత్రని ఇన్నిరోజులు నిజం అని నమ్మి మోసపోయిన వారికోసమే ఈ నిజాలు.
నిజానికి భారతదేశమలో ఐటీ రంగానికి భీజం వేసింది ప్రధానిగా ఉన్న (ఆర్కటెక్ ఆఫ్ డిజిటల్ ఇండియాగా పిలవబడే ) రాజీవ్ గాంధీ గారు. ప్రపంచ ఐటీ అవకాశాల సామర్థ్యాన్ని గుర్తించిన ఆయన దేశంలోకూడా సాఫ్ట్వేర్ ఎగుమతులను ప్రోత్సహించడానికి బెంగళూరు, పూణే, భువనేశ్వర్లలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ లకి 1989లో భీజం వేశారు. దీనికన్నా ముందే రాజీవ్ గాంధీ ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కి సలహాదారుడుగా ఉన్న ఎస్.ఎస్ ఒబరాయి గారు 1987లోనే అమెరికాలోని భారత రాయబార కార్యాలయంతో కలిసి అక్కడ ఆరు ప్రధాన నగరాల్లో మొట్ట మొదటి ప్రధాన సాఫ్ట్వేర్ ఎగుమతి ప్రమోషన్ ప్రచారాన్ని “సాఫ్ట్వేర్ ఇండియా” పేరున నిర్వహించారు. అలాగే తరువాత యు.ఎస్.ఏ, యుకే, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్, హాలండ్, రష్యాలో ఇలాంటి సమావేశాలు “సాఫ్ట్వేర్ ఇండియా” నిర్వహించారు.
ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో ఆయన దేశంలో కూడా సాఫ్ట్వేర్ ఎగుమతులను ప్రోత్సహించడానికి బెంగళూరు, పూణే, భువనేశ్వర్లలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ లకి 1989లో భీజం వేశారు. ఈ సమయంలోనే ఇదే తెలుగుదేశం వాళ్ళు రాజీవ్ గాందీ గారు కంప్యూటర్ రివల్యుషన్ ఎంత ముఖ్యమో చెబుతుంటే ప్రతిరోజు ఆయనని “కంప్యూటర్ బాయ్” , “కంప్యూటర్ మెన్” అంటూ గేళి చేస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం, దేశంలో నిలకడలేని ప్రభుత్వాలు రావడంతో కాస్త ఈ రంగం వెనకపడింది. 1991లో రాజీవ్ గాంధీ గారి హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో అనుకోకుండా ప్రధాని భాధ్యతలు చేపట్టాల్సి వచ్చిన పీవీ నర్సింహారావు గారు వచ్చీ రాగానే ఐటీ, సాఫ్ట్వేర్ ప్రాధాన్యాన్ని గుర్తించారు. దేశంలో నాణ్యమైన మానవవనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నందున ఈ సేవారంగమే నిరుద్యోగ నిర్మూలనకు, దేశాభివృద్ధికి ఊతమిస్తుందని అనుకున్నారు. 1991 జూన్ 5న ఈ మూడు పార్కులని మెర్జ్ చేస్తూ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాని ప్రారంభించారు.
1986లోనే హైద్రబాద్ లో బేగంపేట్ కేంద్రంగా ఇంటర్ గ్రాఫ్ అనే ఐటీ సంస్థ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగ విప్లవానికి సరైన బీజం పడింది మాత్రం కేంద్ర కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తొలుత అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఒక ఎస్టీపీఐ ఆరంభించడంతోనే. ఏపీ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వారు సాఫ్ట్వేర్ ఎక్స్ పోర్ట్ యూనిట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు మైత్రివనం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ లో ఏర్పాటు చేసుకోవచ్చని 30 జూన్ 1991న పత్రికా ప్రకటన ఇచ్చారు.
ఈ ప్రకటనతో అప్పటికే హైద్రబాద్ లో బేగంపెట్ , సర్దార్ పటేల్ రోడ్ లో ఉన్న కొన్ని కంపెనీలతో పాటు మరికొన్ని కూడా వాటి కార్యకలాపాలని ప్రారంభించడానికి ఉత్సాహం చూపడం గమనించిన నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు 1991 డిసెంబర్ 26న ఇన్స్టిట్యుట్ ఆఫ్ చార్టెడ్ కంప్యూటర్ ప్రోఫెషినల్స్ ఆఫ్ ఇండియా హైద్రబాద్ లో నిర్వహించిన ఇండియన్ కంప్యూటింగ్ కాంగ్రెస్ సమావేశంలో హైద్రబాద్ లో ఒక కొత్త సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ని ఏర్పాటు చేయబోతునట్టు ప్రకటించారు. 1990-91 సంవత్సరంలో దేశం 450 కోట్ల రూపాయల సాఫ్ట్ వేర్ ఎగుమతి చేసిందని 1995 నాటికి ఒక బిలియన్ డాలర్లకు చేరవచ్చని, ఎగుమతులకి ఎక్కువ అవకాశాలు ఉన్న ఈ రంగానికి అభివృద్ది చేయాల్సిన అవస్యకత ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1992 మార్చ్ 24న అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం నేత జీ.నాగిరెడ్డి గారు ప్రశ్నోత్తరాల సమయంలో హైద్రబాద్ లో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఎమైనా పెడుతున్నారా అని ఒక ప్రశ్న అడిగారు దానికి సమాధానంగా అవును అని నాటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి పి.రామచంద్రా రెడ్డి గారు సమాధానం కూడా ఇచ్చారు. చెప్పినట్టుగానే రాజీవ్ గాంధీ గారి మొదటి వర్ధంతి 21-మే-1992న రాజీవ్ దార్శనికతకి, టెక్నాలజీకి ఇచ్చిన ప్రాముఖ్యతకు చిహ్నంగా నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు స్వయంగా ఇప్పటి సైబర్ టవర్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు (నాడు దాని పేరు రాజీవ్ గాంధీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్). అప్పట్లో దాని నిర్మాణ అంచనా వ్యయం 4.5 కోట్లు.
ఈ వ్యవహారాలని పర్యవేక్షించటానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి భాద్యతలు అప్పచెప్పారు. దానికి పార్ధసారధి ఎండిగా వ్యవహరించేవారు. అప్పుడే అనేక అమెరికా కంపెనీలు ఇక్కడ తమ వ్యాపారకార్యకలాపాల నిర్వహణకు సంసిద్దత వ్యక్తం చేశాయి. ఒక హార్డ్‌వేర్ పార్క్ నిర్మాణానికి జపాన్ కంపెనీ కూడా ముందుకు వచ్చింది. 400 కోట్ల సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని కూడా నిర్ధేశించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 ప్రముఖ కంపెనీలకు లేఖలు రాసి, రాష్ట్రం కల్పించే ఐటి సదుపాయాలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. భవిష్యత్తులో హైదరాబాద్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ కు, చిప్ డిజైనింగ్ కు కేంద్రం అవుతుందని నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు అప్పుడే జోస్యం చెప్పారు .
సాఫ్ట్వేర్ రంగం వేగంగా అభివృద్ది జరుగుతుందని గ్రహించిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు. రాష్ట్రానికి వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలకు మానవ వనరుల కొరత ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో 11 ఇంజినీరంగ్ కళాశాలలకి అనుమతులు ఇచ్చారు. ఇలా చేయడం అక్రమం అన్యాయం అంటూ నాడు ఇదే చంద్రబాబు కోర్టులకి వెళ్ళి వాటిని రద్దు చేయించాడు. దీంతో నేదురుమల్లి గారు సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఇదే కాలేజీలకి చంద్రబాబు సీఎం హోదాలో అనుమతులు ఇచ్చాడు. నేదురుమల్లి గారు చేసింది తప్పు చంద్రబాబు చేసింది ఒప్పైపోయింది.
నేదురుమల్లి గారి తరువాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి రావడం ఆయన 1.90 పైసలకే కిలో బియ్యం, మధ్యాన భోజనం వంటి సంక్షేమ కార్యక్రమాలపై పెట్టిన దృష్టి సాఫ్ట్వేర్ రంగంపై పెట్టలేదు. దీంతో నేదురుమల్లి గారు తలపెట్టిన రాజీవ్ గాంధీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ మూలన పడింది. 1994 ఎన్నికలు రావడం ఎన్టీఆర్ గారి టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం. లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపి ఎన్టీఆర్ గారిని చంద్రబాబు వెన్నుపోటుతో కుర్చీ నుండి కిందకు లాగి పడేయడం లాంటి కార్యక్రమాలు చక చకా జరిగిపోయాయి.
రాజీవ్ గాందీ టెక్నాలజీ పార్క్ శంకుస్థాపన జరిగిన 1992 నాటి నుండి 1996 వరకు 4ఏళ్లలో పక్కనే ఉన్న బెంగుళూరు సాఫ్ట్వేర్ రంగంలో వేగంగా అభివృద్ది చెందడంతో పాటు ఆ చుట్టుపక్కల భూమి విలువలు కూడా అమాంతం పెరగడం గమనించిన చంద్రబాబు. 1997 ఏప్రిల్ నాటికి నేదురుమల్లి గారు శంకుస్థాపన చేసిన రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ చుట్టూతా ఉన్న వందల ఎకరాలను రైతులని మోసం చేసి తన పార్టీ మనుషుల చేత కొనిపించి, కొంత తాను కొనుగోలు చేసి నేడు అమరావతిలో ఎలాగైతే ఇన్సైడర్ ట్రేడీంగ్ కు పాల్పడ్డారో అలాగే నాడు కూడా వ్యవహరించి రైతుల పొట్ట కొట్టారు.
భూములన్ని తన బినామీల ఖాతాలోకి చేరాయని నిర్ధారించుకున్న చంద్రబాబు, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టుకు కొనసాగింపుగా హైటెక్ సిటీ పేరున ఇంఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ నిర్మాణం చేయవలసిందిగా 158 ఎకరాలు (ఇందులో ఏపీఐఐసీ 11% , ఎల్&టీ 89%) వాటాలతో ఎల్&టీ సంస్థకి అప్పగించాడు. ఇది ఒక పెద్ద స్కాం, ఈ కేటాయింపుల వలన ఏపీఐఐసీ భారీగా నష్టపోయింది. ఈ ప్రాజెక్ట్ ఎల్&టీ సంస్థకు కట్టబెట్టడంలో ఎన్నో అవకతవకలకి పాల్పడ్డాడు చంద్రబాబు, అవేంటో ఒకసారి చూస్తే,
1) గ్లోబల్ టెండర్లను ఆహ్వానించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది.
2) భూమి మార్కెట్ విలువని నిర్ణయించడానికి కమిటీని నియమించలేదు.
3) వేరే కంపెనీలు ఈ ప్రాజెక్టుపై ఎందుకు ఆసక్తి చూపించలేదో చంద్రబాబు ప్రభుత్వం దగ్గర వివరణ లేదు.
4) కేవలం 1,280 రూపాయలకే చదరపు గజాన్ని అమ్మడానికి ఎటువంటి కారణాలు లేవు.
5) ఎల్&టీ తాను నిర్మించిన భవనంలో కేవలం 4 లక్షల చదరపు అడుగులని అమ్మి 108 కోట్ల రూపాయలను సంపాదిస్తుంది ఇది ఆ కంపెనీకు 35% లాభాన్ని ఇస్తుంది ఇందులో ఎటువంటి ప్రజా ప్రయొజనాలు లేవు.
6) కంపెనీలను ఎంపిక చేయడంలో ఎటువంటి ప్రమాణాలను పాటించకుండా ఎల్ &టీ సంస్థకు కట్టబెట్టడం ద్వారా చంద్రబాబుకి 150 కోట్ల రూపాయలు ముడుపులుగా అందాయి.
7) ఇక ఈ ప్రాజెక్టు మాధాపూర్ లో రావడం వలన ముందే కొన్న భూముల విలువలు అమాంతం పెరిగి చంద్రబాబు వారి బినామీలు పెద్ద ఎత్తున లాభం పొంది కోట్లకు పడగలెత్తారు.
8 ) ఇలా ఎల్ & టీ కి లాభం చేకూర్చినందుకు చంద్రబాబుకి వాళ్ళు ట్రస్ట్ భవన్ ని ఉచితంగా నిర్మించి ఇచ్చారు.
ఈ ఆరోపణలకు సంభందించిన పత్రాలతో సుభ్రమణ్యస్వామి గారు కోర్టుల్లో కేసులు కూడా వేశారు, తొలుత కోర్టులు పత్రాలని పరిసీలించి ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నాయని కేసుని స్వీకరించినా ఆ తరువాత తన మార్క్ కధ నడిపి ఎప్పటిలాగే చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేసి ఈ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు.
ఇక నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు శంకుస్థాపన చేసిన చోటే ఆ హైటెక్ సిటీ భవన నిర్మాణం 28 ఏప్రిల్ 1997న ప్రారంభమై 22 నవంబర్ 1998న ప్రారoబించబడింది. ప్రారంభించడానికి ముందు మెహర్భానికి పోయి బిల్‌గేట్స్ ని అడిగారు ఆయన రాను పొమ్మన్నాడు, తరువాత ప్రధాని వాజ్‌పాయి గారిని పిలిచారు ( ఇది ప్రధానిగా ఉన్న వాజ్‌పాయి గారిని అవమానించడమే అని నాడు అందరు వేలెత్తి చూపారు.) అంతే కాకుండా, లోకల్ ఎంపీగా ఉన్న బండారు దత్తాత్రయను పిలవలేదు ఆయన నాడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు, చివరికి చంద్రబాబు వాజ్‌పాయి గారు వచ్చేసరికి ఎక్కడ ఆయనకి విషయం తెలిసి చివాట్లు పెడతారో అనే భయంతో దత్తాత్రేయ గారిని ఎయిర్పోర్ట్ లో బ్రతిమిలాడి రప్పించకున్నారు. ఇక లోకల్ ఎమ్మెల్యే గా ఉన్న నాటి ప్రతిపక్షనాయకుడు పి.జనార్ధన్ రెడ్డి గారిని పిలవకుండా ప్రొటోకాల్ వైలేషన్ చేసినందుకు అశంబ్లీలో క్షమాపణలు చెప్పాడు బాబు .
ఇది ఏదో యాదాలాపంగా జరిగిపోయిన పని కాదు. ఆ క్రెడిట్ కాంగ్రెస్ వారికి మరొకరికి దక్కకుండా వారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనే కుట్రతో చేసిందే. లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వస్తే కచ్చితంగా రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు గార్ల దార్శినకత , నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారి కృషి గురించి మాట్లాడతారని దాంతో పాటు జరిగిన అవినీతిని ప్రధాని సమక్షంలో బయటపెడతారని చేసిన కుట్రగా నాడే అందరు మాట్లాడుకున్నారు.
ఇక చంద్రబాబు వలనే కంపెనీలు వచ్చాయి అనేది కూడా అబద్దమే. ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెట్టడానికి మూడు మూల కారణాలు వెతుకుతాయి. అనువైన స్థలం, మానవ వనరులు, భద్రత. వీటికి అదనంగా ఆ ప్రదేశంలోని ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహకాలు, రాయితీలు. (1995లో దేశియ ఇంకా ఎఫ్‌డీఐ ఇన్వేస్ట్మెంట్లను మరింత ప్రోత్సహించడానికి 10ఏ 10బి కింద భారత ప్రభుత్వం పన్ను రాయతీలు ప్రకటిచింది) అప్పటికే బెంగుళూరు, పూనే వంటి నగరాలు బాగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడంతో కొత్తగా ఐటీ పార్క్ ఏర్పడిన హైద్రబాద్ పై ఐటీ కంపెనీల చూపు పడింది. కారణం నాడు ఇతర నగరాలతో పోల్చి చూస్తే హైద్రబాద్ నగరం కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. హైదరాబాద్ నగరానికి ఘనమైన చరిత్ర ఉంది. 400 ఏండ్ల కిందటే ప్రపంచంలోని సంపన్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల పరంగా ఎదిగిన నగరం. ప్రకృతి వైపరీత్యాలు లేని, మానవ వనరుల పరంగా మెరుగైనది. సహజంగా ఇలాంటి నగరాల్లో అవకాశలు కల్పిస్తే పెట్టుబడులు పెట్టేవారు ఎక్కువ.
నిజానికి చంద్రబాబు నాయుడి పాలనకు ముందే హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. టీసీఎస్ 1995 కంటే ముందుగానే దక్కన్ ఐటీ పార్క్ పేరుతో కంపెనీని ప్రారంభించింది. కానీ 2000 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు వచ్చాయంటే కారణం టెక్నాలజీ పార్కు ఏర్పాటు చేయడం మరియు పాత కంపెనీలు లాభదాయకంగా నడవడం, పైన పేర్కొన్న మూడు కారణాలు అనుకూలంగా ఉండడం. అంతేకాని ఐటీ అభివృద్ధిలో ఎవరి పాత్ర లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే ఆక్రెడిట్ అంతా రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుకే దక్కుతుంది. ఈ కారణంతోనే హైద్రబాద్ కన్నా వేగంగా ఐటీ అభివృద్ది చెందిన బెంగుళూరు, పూనే, చెన్నై లాంటి నగరాల్లో కూడా ఎవరు తమ వలన ఐటీ వచ్చిందని చెప్పుకోరు ఇక్కడ మాత్రమే చంద్రబాబు తన వలనే వచ్చిందని చెప్పుకుంటాడు.
ఇంకా వాస్తవాలు మాట్లాడుకోవాలంటే 1998లో హైటెక్ సిటీ వచ్చిన తరువాత అప్పటి నుంచి 2004 వరకు చంద్రబాబు పాలనా కాలంలో ఐటీలో పెద్ద చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ జరగలేదు. ఇప్పుడు ఎంతో రద్దీగా మారిన కూకట్ పల్లి, మాదాపూర్, మెహదీపట్నం, గచ్చిబౌలి రోడ్లు 2004 వరకు ఎంత నిర్మానుష్యంగా ఉండేవో ఆనాడు చూసిన వారికి తెలుసు. అంతే కాకుండా ఆనాడు జరిగిన అభివృద్ది గణంకాల రూపంలో ఇప్పటికి భద్రంగా ఉన్నాయి. దాని ప్రకారం 1994 -1995 సంవత్సరంలో మూడవసారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు మన దేశం యొక్క సాఫ్ట్వేర్ ఎగుమతులు 250 కోట్లు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 22 కోట్లు అంటే 9%. 1998-99 సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఎగుమతులు 22 కోట్లు నుండి 575 కోట్లు అయింది కానీ దేశ వ్యాప్తంగా లెక్కలు వేస్తే అదే సంవత్సరం భారత దేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎగుమతులు 6,300 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కేవలం 575 కోట్లు అంటే 9% మాత్రమే. అదే ఏడు కర్నాటక సాఫ్ట్వేర్ ఎగుమతులు 2,888 కోట్లు ఉంది. నోయిడాకు సంబంధించి 1,430 కోట్లు ఉంది. తమిళనాడుకి సంబంధించి 800 కోట్లు ఉంది. ఇంక చంద్రబాబు 2004లో దిగిపోయే సమయానికి రాష్ట్రం ఎగుమతులలో 3వ స్థానం నుండి 5వ స్థానానికి వచ్చాము.
గణాంకాల ప్రకారం చూస్తే చంద్రబాబు వలన హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగం పురోగతి సాదించకపోగా ఇతర రాష్ట్రాల తో పోల్చితే మరింత వెనక పడింది అనేది కాదనలేని సత్యం.
వాస్తవం ఇలా ఉంది కాబట్టే 2004 ఎన్నికల్లో ఆ ఐటికి హబ్ అయిన హైదరాబాద్ జిల్లాలో ఒకే ఒక్క స్థానంకే పరిమితం అయ్యారు చంద్రబాబు గారు, 2009 గ్రేటర్ ఎన్నికల్లో చాలెంజ్ చేసి మరీ కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2016 గ్రేటర్ లో సింగిల్ స్థానానికే పరిమితం అయ్యారు. హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ ఉన్న ప్రాంతంలో సాఫ్ట్ వేర్ హబ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసింది స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన రెడ్డి. సైబర్ టవర్స్ బిల్డింగ్ వచ్చింది నారా చంద్రబాబు హయాంలో. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ శివారు ప్రాంతంగా ఉన్న నానక్ రాం గూడ వరకు విస్తరించటానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖరర్ రెడ్డి గారు. ఇది కాదనలేని సత్యం .. దీని సాక్ష్యం లెక్కలతో సహా ఉన్నాయి.
చంద్రబాబు
వైయస్సార్
(ఈ గ్రోత్ కి కారణం వైయస్సార్ గారు సింగిల్ విండో అనుమతులు తీసుకుని వచ్చారు)
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గారు ఒకనొక సమయంలో పార్లమెంటు భవనం లేకపోవటం మినహా దేశ రాజధాని అవ్వటానికి అన్ని అర్హతలు హైదరాబాద్ కి ఉన్నాయని అన్నారు. ఉత్తర ధక్షిణ భేదాలు పోవాలి అంటే హైద్రాబాద్ ని భారత దేశానికి రెండో రాజధాని గా చేయటం మంచిది అన్నారు. అటువంటి హైద్రాబాద్ బాబు గారి వల్లే డెవలప్ అయింది అని ఆ పార్టీ హైద్రబాదులో రోడ్లు పట్టుకుని తిరుగుతూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం. హైద్రబాద్ లో ఐటీ పుట్టుకకు చంద్రబాబు కారణం కాదు, ఐటీ పెరుగుదలకూ చంద్రబాబు కారణం కాదు. కానీ వారి వర్గం ఆ హైటెక్ సిటీ చుట్టూ భూములు కొని కోట్లకు పడగలెత్తడానికి మాత్రం ముమ్మాటికీ చంద్రబాబే కారణం.