మంగళగిరిలో ఎలాగైనా గెలవాలని లోకేష్చేయని ప్రయత్నం లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు శాఖలకు మంత్రిగా పని చేసారనే అపవాదు మూటకట్టుకున్న లోకేష్ టీడీపీకి విజయావకాశాలు లేని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి తన ప్రతాపాన్ని చూపించాలని మాస్టర్ ప్లాన్ వేసాడు. కానీ 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ గెలవలేడనే వార్తలకు ఆజ్యం పోసినట్లైంది. టీడీపీ శ్రేణులకు సైతం లోకేష్ నాయకత్వంపై అనుమానాలు ఏర్పడడానికి ప్రధాన కారణం మంగళగిరిలో ఓటమి పాలవడమే..
ఓటమి అనంతరం ఈసారి ఎలాగైనా మంగళగిరిలో గెలవాలనే కసితో అక్కడే ఉంటూ అనేక కార్యక్రమాలను లోకేష్ నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు అయిన మురుగుడు లావణ్యను లోకేష్ పై పోటీకి దింపారు. స్థానిక నేత కావడం, పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో లోకేష్ ఈసారి కూడా గెలవడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో లోకేష్ కి మరో రూపంలో పెద్ద కష్టం వచ్చి పడింది.
తాజాగా బోడె రామచంద్రయాదవ్ మంగళగిరి నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం లోకేష్ కి పెద్ద షాక్ కలిగించే వార్తగా చెప్పవచ్చు. భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి దానికి అధ్యక్షుడుగా కొనసాగుతున్న రామచంద్రయాదవ్ కి బీసీ వర్గాల్లో మంచి పేరుంది. కాగా సామాజిక సమీకరణాల పరంగా మంగళగిరిలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దీంతో బీసీ వర్గ ఓట్లపై ఆశ పెట్టుకున్న లోకేష్ కి రామచంద్రయాదవ్ రూపంలో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. రామచంద్రయాదవ్ కి పడే ప్రతీ ఒక్క బీసీ ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయ్యే అవకాశం లేకపోలేదు.
ఓట్ల చీలిక వల్ల లోకేష్ కి పడే ఆ కాసిన్ని ఓట్లకు కూడా రామచంద్రయాదవ్ గండికొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో లోకేష్ గెలుపుపై సందేహాలు ఏర్పడుతున్నాయి. దీంతో టీడీపీ శ్రేణుల్లో లోకేష్ మరోసారి గెలిచే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. బీసీ ఓట్లను కొల్లగొట్టాలనే యోచనతో బోడె రామచంద్రయాదవ్ మంగళగిరి నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. త్రిముఖ పోరు వల్ల లోకేష్ కి ఈసారి కూడా గెలుపు అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.