ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా వెంటనే స్పందించి ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరుపుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాల గురించి తెలుసుకుంటున్నారు. మిచాంగ్ తుఫానును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావాన్ని తట్టుకునేందుకు అత్యవసర ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు విడుదల చేసింది.
తుఫాను పరిస్థితులపై 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మనం ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, సహాయక శిబిరాల్లో అలాంటివి ఉండాలని కాస్త డబ్బు ఖర్చైనా ప్రజలకు ఎలాంటి లోటూ రాకూడదని చెప్పారు. ప్రతీ బాధిత కుటుంబానికి రూ.2,500 ఇవ్వాలని, బాధిత వ్యక్తికి అయితే రూ.1000 ఇవ్వాలన్నారు. క్యాంపులకు రాకుండా ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కంది పప్పు, పామాయిల్, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున అందించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
మిచాంగ్ తుఫానుతో పంట నష్టం జరుగుతుందని కలవరపడ్డ రైతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దమనసుతో ఆదుకుంది. ఖరీఫ్ పంటను కాపాడుకునే దిశగా తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. గత 48 గంటల్లో సుమారు 1.07లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుండి సేకరించింది.
ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆన్లైన్లో 75 వేల మంది రైతుల నుంచి రూ.1,211.49 కోట్ల విలువైన 5.30 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 55 వేల మంది రైతులకు సుమారు రూ.750 కోట్ల వరకు నిర్ణీత కాల వ్యవధిలో వారి ఖాతాల్లో జమ చేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా ఆన్లైన్లో 96,965 టన్నులు, ఆఫ్‌లైన్‌లో 48వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కృష్ణాలో కొన్న ధాన్యం ప్రత్యేక వాహనాల్లో పక్క జిల్లాల్లోని డ్రయర్ మిల్లులకు తరలించారు.
అయితే వర్షాలు కురుస్తుండటంతో పంట కోతలు చేపట్టొద్దని రైతులను అధికారుల కోరారు. కోసిన ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేసి డ్రయర్ మిల్లులకు తరలిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 40 వేల టన్నులకుపైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.. మాన్యువల్‌గా పుస్తకంలో రైతుల ధాన్యం వివరాలను నమోదు చేసుకుని మిల్లులకు తరలిస్తున్నారు. తేమ 18 శాతం ఉన్నప్పటికీ మిల్లర్లు సహకరిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంతో పాటు తుఫాను ప్రభావిత 8 జిల్లాలలో 181 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు.