కర్ణాటక నుండి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న అలుగు పొలుసులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో( ఎస్ఈబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బెంగళూరు నుంచి విజయవాడ వెళుతున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న అలుగు పొలుసులను గుర్తించారు. మొత్తం మూడు బ్యాగుల్లో ఉన్న 57 కిలోల అలుగు పొలుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో సుమారు రూ. 57 లక్షల ఉండొచ్చని అధికారులు తెలిపారు. కాగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు పరారవ్వడంతో బస్సు డ్రైవర్ ను అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు ఒంగోలు ఎస్ఈబీ సీఐ లత వెల్లడించారు.
అలుగులకు ఎందుకింత డిమాండ్?
చీమలు, చెదపురుగులను తింటూ బొరియల్లో నివసించే అలుగులను పాంగోలిన్ అని అంటారు. ఇవి చూడటానికి ముంగిసలా ఉన్నా తల నుండి తోక వరకూ పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులు చాలా గట్టిగా ఉంటాయి. ఈ పొలుసులతో పాటు అలుగు మాంసానికి చైనా, వియాత్నం లాంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అక్రమ రవాణా జరిగే జీవుల్లో అలుగు కూడా ఒకటి. పాంగోలిన్ పొలుసులను ఖరీదైన వస్త్రాలు, ఆభరణాలతో పాటు పొలుసుల పొడిని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాలెట్ల తయారీకి కూడా పాంగోలిన్ పొలుసులను ఉపయోగిస్తుండటం వలన వేటగాళ్లు అధిక లాభాల కోసం ఈ జంతువులను ఎక్కువగా వేటాడుతున్నారు. దీంతో అలుగుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
యథేచ్ఛగా అలుగులను వేటాడటం వలన అంతరించిపోయే జీవుల జాబితాలోకి ఇవి చేరాయి. ప్రభుత్వం వీటిని కాపాడేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నా వీటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో అలుగల ధర ఎక్కువగా ఉండటంతో వేటగాళ్లు వెనక్కి తగ్గడం లేదు. అలుగులకు భయం వేస్తే కదలకుండా బంతిలా ముడుచుకు పోతాయి. దాంతో అత్యంత సులువుగా వేటగాళ్లకు వీటిని వేటాడటం, తరలించడం సాధ్యపడుతుంది.