విజయ్ దేవరకొండకి కొంతకాలంగా సరైన హిట్ పడటం లేదు. దిల్ రాజు నిర్మాణంలో గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ గా నిలిచింది. దానికి తోడు సోషల్ మీడియాలో సినిమాపై విపరీతమైన ట్రోలింగ్‌తో పాటు నెగెటివ్ పబ్లిసిటీ జరిగింది. దిల్ రాజుకి భారీ నష్టాలు మిగిల్చిన ప్రాజెక్టుగా ఫ్యామిలీ స్టార్ నిలిచినా మరోసారి దిల్ రాజు విజయ దేవరకొండతో సినిమా ప్రకటించారు.
రాజావారు రాణిగారుతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించనున్నారు. ఓ రూరల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ చిత్రం గురించి మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా బిగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గూఢచారి పాత్రలో విజయ్ నటిస్తున్నారని తెలుస్తుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో పాటలు ఉండవని సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.