2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రకటనల్లో మునిగి తేలుతున్నాయి, ఈ విషయంలో అధికార వైసీపీ మిగతా అన్ని పార్టీల కన్నా ముందుందని చెప్పొచ్చు. దాదాపు రెండు నెలలుగా అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తూ ఎప్పటికప్పుడు విడతల వారీగా జాబితాలు విడుదల చేస్తూ వచ్చింది.
ఆయా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న సమస్యలు ఒకొకటి పరిష్కారం చేసుకుంటూ నియోజక వర్గాలలో సమన్వయకర్తలను నియమించుకుంటూ ముందుకు వెళ్తోన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా 12వ జాబితాను విడుదల చేసింది. గాజువాక అసెంబ్లీ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్, చిలకలూరిపేట అసెంబ్లీ సమన్వయకర్తగా కావటి మనోహర్ నాయుడును నియమిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలోనే కర్నూల్ మేయర్ గా కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్ ,బీసీ వర్గానికి చెందిన పి సత్యనారాయణమ్మను నియమించింది. అదేవిధంగా మండలిలో విప్ గా వరుదు కళ్యాణి నియమిస్తూ ప్రకటన చేసింది.
కాగా గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీని కొద్దికాలం క్రితం గుంటూరు 2 కి ఇంచార్జ్ గా పంపి ఆమె స్థానంలో మల్లెల రాజేష్ నాయుడుని ఇంచార్జ్ గా ప్రకటించిన విషయం తెలిసిందే . తాజాగా ప్రకటించిన లిస్టులో రాజేష్ నాయుడిని కూడా పక్కన పెట్టి అతని స్థానంలో గుంటూరు నేత కావటి మనోహర్ నాయుణ్ణి ఇంచార్చ్ గా ప్రకటించటంతో రాజేష్ అనుచర వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.