దివంగత ముఖ్యమంత్రి మహానేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోట్లమంది పేద ప్రజలు లబ్ది పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఆరోగ్యశ్రీ పథకానికి మరింత మెరుగులు దిద్దుతూ రాష్ట్ర ప్రజలందరికీ చేరువయ్యేలా చేయడానికి వైయస్ జగన్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19 నుంచి అనేక నూతన ఫీచర్లతో రూపొందిన సుమారు 1.42 కోట్ల సరికొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జగన్ సర్కారు ఇంటింటికీ పంపిణీ చేయనుంది. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ సేవలను సులభంగా ఎలా పొందవచ్చో ప్రజలకు తెలిసేలా ఇంటింటికీ వెళ్లి వైద్య శాఖ సిబ్బంది వివరించనున్నారు. ఇప్పటికే వైద్య శాఖ సిబ్బందికి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ట్రైనింగ్ కూడా ఇచ్చింది.
వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటినుండే బలోపేతం చేయడంపై వైయస్ జగన్ ప్రత్యేక శ్రద్ద పెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి రూ. 632 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టగా వాటిని జగన్ ప్రభుత్వం తీర్చడం గమనార్హం. చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ల సంఖ్య 1,059 మాత్రమే. కానీ మరిన్ని వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడంతో ప్రొసీజర్ల సంఖ్య 3,257 చేరింది. దీంతో పేదలకు మరిన్ని వ్యాధులకు వైద్య సేవలు ఉచితంగా అందాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు బాబు దిగిపోయేనాటికి 748 మాత్రమే. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు 2,309 పెరిగాయి. దీంతో ప్రజలకు చేరువలో ఉన్న ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు మార్గం దొరికింది.
బాబు హయాంలో 22 లక్షల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పొందారు. తద్వారా ఉచిత వైద్యం కోసం నాటి ప్రభుత్వం చేసిన ఖర్చు-5,177 కోట్లు. జగన్ పాలనలో ఇప్పటివరకూ 37.40 లక్షల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పొందగా ఉచిత వైద్యం కోసం జగన్ సర్కారు చేసిన ఖర్చు గత ప్రభుత్వం ఖర్చు చేసినదానికన్నా రెట్టింపు స్థాయిలో రూ.11,860 కోట్లుగా ఉంది. దాంతో పాటు ఖరీదైన వ్యాధులుగా పేరొందిన క్యాన్సర్, ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వాటికి కూడా చికిత్స పొందేలా ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల వరకూ పెంచింది జగన్ ప్రభుత్వం. అంతేకాకుండా చికిత్స అనంతరం రోగులు కోలుకునే సమయంలో పేద ప్రజలందరికీ ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’తో ఆర్థిక తోడ్పాటు అందించడం పేద ప్రజల ఆరోగ్యంపై జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువయ్యేలా ముఖ్యమంత్రి జగన్ గారు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు