ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉనికి నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేయనుందని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసారు.
నిన్న మణిపూర్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల కూడా హాజరయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిగా చేయాలని పార్టీ హై కమాండ్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ విషయంలో మల్లిఖార్జున ఖర్గే స్పష్టత నివ్వడంతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు పంపారు. హైకమాండ్ ఆదేశాల తోనే గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది.
కాగా వైఎస్ షర్మిల తెలంగాణాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి పాదయాత్ర కూడా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ సూచన మేరకు ఎన్నికల్లో పాల్గొనకుండానే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. కాగా సీల్డ్ కవర్ రాజకీయాలు చేసే పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీకి ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఎన్నిక కానున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ అగ్ర నేతల మాటలను ఎంత వరకూ చెవిన పెడతారో వేచి చూడాలి.