‘నాకు చెల్లెలంటే ప్రాణం. తను ఆనందంగా ఉంటే చాలు..’ కొన్నేళ్ల క్రితం ఓ ఇంగ్లిష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలివి. కానీ అదే చెల్లెలు నేడు ప్రత్యర్థుల భుజాలపై నుంచి అన్నపై బాణాలు వేస్తోంది.
షర్మిల.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె. బ్రదర్ అనిల్ కుమార్ భార్య. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి హడావుడి చేసిన ఆమె ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. ఆమె మాటలు, వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చంద్రబాబు డైరక్షన్లోనే నడుస్తున్నట్లు ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. జగన్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తోంది కాబట్టి ఎల్లో మీడియాకు ఆమె ఇష్టపుత్రిక అయిపోయారు. తాజాగా షర్మిల మాట్లాడుతూ పాదయాత్ర చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టానని, జగన్ ఆ కృతజ్ఞత మర్చిపోయారని అన్నారు. ఇది విన్న ప్రజలు ఆమె అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటున్నారు. వైఎస్సార్సీపీ జగన్ రెక్కల కష్టం. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని శాసించిన సోనియా గాంధీని ఢీకొని ఆంధ్రప్రదేశ్‌లో దుష్టచతుష్టయానికి ధీటుగా నిలబడ్డారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి విజేతగా అవతరించారు. దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా మారారు.
మీ వల్ల కాదు షర్మిల గారూ..
కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కలిసి కుట్రలు పన్ని జగన్‌పై కేసులు పెట్టించి జైలుకు పంపాయి. బెయిల్ కూడా రాకుండా అడ్డుకుని 16 నెలలపాటు జైల్లో ఉండేలా చేశాయి. కానీ ఏనాడూ జగన్ ధైర్యం కోల్పోలేదు. ప్రజలనే నమ్ముకున్నారు. జైల్లోనే సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశారు. అన్న జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు షర్మిల పాదయాత్ర చేశారు. దీనిని కాదనలేం. అయితే ఆమె దీనిని చూపించి వైఎస్సార్సీపీని నిలబెట్టానని నేడు అంటున్నారు. అదే నిజమైతే 2014లో ఆ పార్టీ అధికారంలోకి రావాలి కదా.. కానీ అలా జరగలేదు. బెయిల్‌పై బయటికొచ్చిన జగన్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని ఎదుర్కొన్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచినా 60కి పైగా స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించారు.
ఐదేళ్లలో మీరెక్కడ?
2014–19 మధ్య షర్మిల రాజకీయాల్లో లేరు. ప్రజల కోసం ఏమి చేయలేదు. జగన్ ఒక్కడే టీడీపీ, ఎల్లో మీడియాను ఎదుర్కొని రాటుదేలారు. పాదయాత్ర చేసి తన బలాన్ని వెయ్యి రెట్లు పెంచుకున్నారు. ప్రజలు నమ్మి 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలు ఇచ్చారు. 2014 నుంచి పార్టీని నిలబెట్టి అధికారంలోకి తీసుకొచ్చింది జగన్ తెగువే. ఇందులో షర్మిల కష్టం ఒక్క శాతం కూడా లేదు.
బాబు డైరెక్షన్లో..
షర్మిల చంద్రబాబు ఆడుతున్న రాజకీయ విష క్రీడలో ఒక పావుగా మారారు. కాంగ్రెస్, బాబు కలిసి తన కుటుంబాన్ని చీల్చాయని జగన్ ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. అది ముమ్మాటికీ నిజం. తమ ఎదుట మొనగాడిలా నిలబడి ఆకాశమంత ఎదిగిన వ్యక్తిని అన్ని విధాలుగా దెబ్బ తీసేందుకు బాబు, ఎల్లో మీడియా కలిసి కొంతకాలం క్రితం వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతను ఉసిగొల్పారు. నేడు ఏకంగా చెల్లెలు షర్మిలను రంగంలోకి దించారు. తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానన్న ఆమె ఎవరి కోసం ఏపీకి వచ్చారో తెలిసిపోతోంది. బాబు ఇచ్చిన స్క్రిప్ట్‌లో భాగంగా నేడు షర్మిల సునీత భేటీ అవుతున్నారు. నారా వారిని నమ్మి, ఆయన మాటలు విని ఎవరూ బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న షర్మిలను కూడా చివరికి కరివేపాకులా తీసిపడేస్తాడు. ఆకాశానికి ఎత్తుతున్న ఎల్లో మీడియా ఏదోత ఒకరోజు కింద పడేయం కాదు.. ఏకంగా భూస్థాపితం చేసేస్తుంది.