మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా పెన్షన్లను క్రమంగా రూ. 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1, 2024 నుండి పెంచిన పింఛన్లను లబ్దిదారులకు అందజేస్తుంది జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా జనవరి 1 నుండి 8 రోజులపాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా నేడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.
ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి జగన్ బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
పెన్షన్ల పంపిణి విధానంలో జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాల ఫలాలను చేర్చిన ఘనత దేశం మొత్తంలో ఒక్క జగన్ ప్రభుత్వానికే దక్కింది. గత టీడీపీ ప్రభుత్వంతో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఒక్కో లబ్దిదారుడికి నెలకు అందించిన పెన్షన్ కేవలం రూ. 1,000 మాత్రమే.ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య కేవలం 39 లక్షలు కాగా పెన్షన్ల పంపిణీకి చేసిన ఖర్చు కేవలం 400 కోట్లు మాత్రమే.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన ఐదేళ్లలో 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్ల సంఖ్య 29,51,760 కాగా మొత్తం పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు. ఈ ఏడాది జనవరి ఒకటి నుండి 66.34 లక్షల పెన్షన్లపై ప్రతీ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న వ్యయం అక్షరాలా రూ.23,556 కోట్లు కాగా ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా రూ. 83,526 కోట్లను లబ్దిదారులకు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కింది. నెలకు రూ.3000 చొప్పున 66.34 లక్షల మందికి పెన్షన్ అందించేందుకు జగన్ ప్రభుత్వం నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లకు చేరడం గమనార్హం.