ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ అధ్యక్షతన సిద్ధం సభలు సక్సెస్ కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్ లో ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇడుపులపాయ నుండి ప్రారంభమయ్యే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా సీఎం జగన్ ప్రజలతో మమేకం కానున్నారు.
ఈ నెల 27వ తేదీ నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా మొదట ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ని సీఎం జగన్ సందర్శించనున్నారు. అక్కడనుండే బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు బస్సుయాత్ర చేరుకుంటుంది. ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు.
అనంతరం 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురంలో బస్సుయాత్ర కొనసాగనుందని సమాచారం. కాగా సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో మమేకం కాబోతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో కదనోత్సాహం వెల్లివిరుస్తుంది. సీఎం జగన్ వెంటే తాము నడుస్తామంటూ వైసీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తున్నారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుందని సమాచారం.