మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చినట్లు హైకోర్టు తెలిపింది. వివేకానంద రెడ్డి కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హైకోర్టు ఇప్పటికే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న దస్తగిరి హైకోర్టులో పిటిషన్ వేశాడు. అవినాశ్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.
మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో నిరాశ తప్పలేదు. వారిద్దరికీ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇటీవల జరిగిన విచారణలో పలు కీలక అంశాలను సీబీఐ కోర్టుకు తెలిపింది. వైయస్ వివేక హత్య జరిగి ఐదు సంవత్సరాలు కావొస్తున్నా సీబీఐ సరైన విచారణ చేయడం లేదంటూ సర్వత్ర విమర్శలు ఎదుర్కొంటుంది.