పాపం ఎల్లో మీడియా బాధలు వర్ణనాతీతంగా మారాయి. సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా వెళతారని చెప్పేందుకు కలం కదలడం లేదు. కానీ పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నేతలు మాత్రం సీఎం జగన్ ని తమకు తెలియకుండానే ఆంధ్రప్రదేశ్ హీరోగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే ఎల్లో మీడియా మాత్రం రాయలసీమకు జగన్ చేసిందేమి లేదంటూ అబద్దాలు వండి వార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు జగన్ ని హీరోని చేసే పనిలో పడ్డారు.
కొద్దిరోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను, బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాయలసీమకు లబ్ది చేకూర్చడానికి నీటి తరలింపులు ఏవిధంగా చేపట్టారో ప్రపంచానికి చాటి చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో తెలియక తలలు పట్టుకుంది ఎల్లో మీడియా. ఆంధ్ర ప్రయోజనాల కోసం పోలీసులతో వచ్చి నాగార్జున సాగర్ ని ఆక్రమించుకుంటుంటే కేసీఆర్ స్పందించలేదని పరుష పదజాలం వాడారు రేవంత్ రెడ్డి.
తాజాగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ వైయస్ హయాంలో 44వేల క్యూసెక్కులు ఉంటే 2020లో జగన్ 90వేలకు పెంచారని, అంతేకాకుండా రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తుందని తెలంగాణ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు. తెలంగాణ ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్‌పైకి పోలీసులను పంపి రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయిందని వెల్లడించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను గమనిస్తే జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తారని తెలుస్తూనే ఉంది. కానీ ఎల్లో మీడియాకి జగన్ తెగింపు కనబడదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం సీఎం జగన్ కష్టపడుతుంటే ఆ వార్తలు కవర్ చేయడానికి కూడా ఎల్లో మీడియాకి మనసు రాదు. ముఖ్యంగా ఓ పార్టీ ప్రయోజనాల కోసం జర్నలిజం విలువలను తాకట్టు పెట్టి పనిచేస్తున్న ఎల్లో మీడియాకి ఆ పార్టీ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలతో పని లేదు. కేవలం సీఎం జగన్ పై విష ప్రచారం చేస్తూ పబ్బం గడుపుదామనే స్పృహ తప్ప మంచి వార్త ప్రచురిద్దామనే ధ్యాస ఎల్లో మీడియాకి లేదన్నది సుస్పష్టంగా అర్ధమవుతుంది.