రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై ఎప్పటికప్పుడు విషం కక్కుతూ వస్తున్న రామోజీరావు మరోసారి ఆరోగ్యశ్రీపై బురదజల్లారు.పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం సమర్ధంగా అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీపై బకాయిల రోగం -సేవలు ఘోరం అంటూ అవాస్తవ కథనాన్ని ఈనాడు వండి వార్చింది.
పచ్చ కళ్ళద్దాలతో విషం చిమ్ముతూ వస్తున్న ఈనాడు తాజాగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేస్తున్నాయంటూ పేదలందరికీ సక్రమంగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నప్పటికీ పనిగట్టుకొని విషప్రచారం చేస్తోంది. వాస్తవాలని పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ టస్టు నుంచి రూ.2,146.90 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రుల ఖాతాల్లో జమ చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఇప్పటి వరకు రూ.2,790.61 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం గడిచిన మూడు నెలలల్లో రూ.1,042.83 కోట్లను నెట్వర్క్ ఆసుపత్రుల ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేసింది. పరిశీలన తర్వాత పెండింగ్లో ఉన్న మొత్తం రూ.369 కోట్లు మాత్రమే. ఈనాడులో ప్రచురించినట్లుగా ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదన్న కథనం పూర్తిగా అవాస్తవం, నిరాధారం.
గతంలో కంటే మిన్నగా ఆరోగ్యశ్రీ సేవలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డా. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తుంది. గత ప్రభుత్వంలో 1000 చికిత్సలకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిమితం కాగా జగన్ ప్రభుత్వం చికిత్సల సంఖ్యను 3,257కి పెంచింది. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే దాన్నిఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చింది. చికిత్సల సంఖ్య, లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో చికిత్స ముందస్తు అనుమతి, క్లెయిమ్లు రోజుకు 1,547 నుంచి 5,608కి పెరిగాయి. తాజాగా ప్రతి కుటుంబానికి వార్షిక చికిత్స పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచి పేదలపై పైసా భారం పడకుండా ప్రభుత్వం పలు విప్లవాత్మక చర్యలు తీసుకుంది.
ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందేటప్పుడు నెట్వర్క్ ఆరోగ్యమిత్రల పర్యవేక్షణ ఉంటుంది. డిశ్చార్జ్ సమయంలో ఆసుపత్రిలో సేవలు ఎలా అందాయో నమోదు చేస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం రోగులు ఇంటికెళ్లిన రోగుల నుండి సచివాలయ ఆరోగ్యమిత్ర, ఏఎన్ఎంలు ఫీడ్బ్యాక్ తీసుకుని నమోదు చేస్తారు. అంతేకాకుండా 104 కాల్ సెంటర్ నుంచి క్రాస్ వెరిఫికేషన్ ఉంది. వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా టోల్ ఫ్రీ నంబర్లు కూడా ప్రజలకు చేరువలో ఉన్నాయి. ఇలా ఇన్ని దశల్లో ఆరోగ్యశ్రీ అమలులో లోపాలు గుర్తించేందుకు ప్రత్యేకమైన నిఘా ఉన్నందున రోగుల నుంచి బలవంతపు వసూళ్లు జరిగే ఆస్కారమే లేదు. కానీ ఈనాడు ఈ వాస్తవాలను కప్పిపెట్టి అవాస్తవాలను ప్రచురించడాన్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ తీవ్రంగా ఖండించింది. ఈనాడు చేస్తున్న దుష్ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.