భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై సీపీఎం, సీపీఐ ముఖ్య నేతలు మండిపడ్డారు. వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నలు సంధించారు. అర్ధరాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చేసుకున్న చీకటి ఒప్పందాలేమిటో చంద్రబాబు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
విభజన హామీలు, ప్రత్యేక హోదా లాంటి అంశాల్లో రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన కమలం పార్టీని ఎలా భుజానికెత్తుకుని మోస్తారని నిలదీశారు. గతంలో దేశాన్ని ఏకం చేస్తా, మోడిని దించేస్తా, ఏ మొహం పెట్టుకొని మా రాష్ట్రానికి వస్తావు గో బ్యాక్ అని మోడిని ఉద్దేశించి అన్న చంద్రబాబు బాబు, లోకేశ్‌లు స్వార్థంతో పదవులు, అధికారం కోసం మళ్ళీ బీజేపీ పంచన చేరారని విమర్శించారు.
రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని టీడీపీకి మరణ శాసనంగా అభివర్ణించారు. రాష్ట్రానికి హోదా ఇవ్వలేదని ఆనాడు బయటికొచ్చి ధర్మ పోరాట దీక్షలంటూ తిరుపతి వెంకన్న సొమ్ము కోట్లు ఖర్చు పెట్టి షోలు చేసి నేడు ఏ కారణంతో కలుస్తున్నారో చెప్పాలన్నారు. బీజేపీని , దానితో పెట్టుకునే పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.