‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మతవిశ్వాసాలపై ఒకటే చెప్పారు. ఏ చట్టం తీసుకురావాలన్నా.. అందరి ఏకాభిప్రాయం ఉండాలన్నారు. విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులున్న ఈ దేశంలో ఏకాభిప్రాయం అనేది ముఖ్యమని చెప్పారు. బీజేపీ అమలు చేసే యూనిఫాం కామన్ సివిల్ కోడ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ స్టాండ్ ఏంటో 24 గంటల్లోగా సమాధానం చెప్పకపోతే ముస్లిం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకిగా ఆయన పనిచేస్తున్నారని అందరూ అర్థం చేసుకుంటారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. మనుక్రాంత్‌రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా శనివారం నెల్లూరు నగరంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విజయసాయిరెడ్డి మాట్లాడారు.
జనసేన జిల్లా అధ్యక్షుడు వైఎస్సార్సీపీలో చేరారంటే పవన్ పార్టీ ఎంత బలహీనపడింది. మేం ఎంతంగా ఉన్నామనేది స్పష్టంగా తెలుస్తోంది. మనుక్రాంత్‌రెడ్డి, మేము మరోసారి జగన్‌ను సీఎం చేసేందుకు కష్టపడి పని చేస్తాం. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈ ఎన్నికల్లో రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెడతారంట. పొంగూరు నారాయణ రూ.500 కోట్లు ఖర్చు చేస్తారంట. విదేశాల నుంచి ఇక్కడకొచ్చి టీడీపీ తరఫున పోటీ చేసే ఎన్ఆర్ఐలు, మిగతా ధనవంతులు, పెత్తందారులు చాలా విషయాలు తెలుసుకోవాలి. రాజకీయ పరిపక్వత కలిగిన ఈ జిల్లాలో డబ్బుతో అంతా నడుస్తుంది అనుకుంటే కుదరదు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వేమిరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి, మిగిలిన వారు మొదటి నుంచి టీడీపీలో ఉన్న నాయకులు కాదు. నిన్న 40 మంది వలంటీర్ల చేత రాజీనామాలు చేయించి వారికి నారాయణ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఆశచూపి టీడీపీలో చేర్చుకున్నారు. అయితే వారంతా ఈరోజు వైఎస్సార్సీపీలో చేరారు. దీనిని బట్టి వలంటీర్ల మనసంతా జగన్‌పైనే ఉంది. నిజమైన నాయకుడు ఆయనేనని వారందరికీ తెలుసు. మా పార్టీలో ఉన్న వారిని వేరెవ్వరూ కదిలించలేరు. డబ్బుతో కొనలేరని గర్వంగా చెబుతున్నాం.
చంద్రబాబు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నారాయణను అడుగుతున్నా. మీరు మతతత్వ బీజేపీతో జతకట్టారు. మేము ఏ రోజూ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. మాకు పొత్తుతో అవసరం కూడా లేదని గతంలో చెప్పాం. ఇప్పుడూ చెబుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బలపరిచాం. అంతే తప్ప మైనార్టీల మనోభావాల్ని దెబ్బతీసే ఎవరితోనూ జతకట్ట లేదు. వారికి సపోర్టు కూడా చేయలేదు. భవిష్యత్‌లోనూ చేసేది లేదు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామిగా ఉంటారు. మైనార్టీలు, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకమైన యూనిఫాం సివిల్ కోడ్‌ను బీజేపీ అమలు చేయాలని భావిస్తోంది. బాబు దీనికి అనుకూలమా? వ్యతిరేకమా? అని చెప్పి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మైనార్టీలు, క్రిస్టియన్లు టీడీపీకి సపోర్టు చేయొద్దు. ఆయన మాయమాటల్ని నమ్మి ఓట్లు వేస్తే.. మీ మత విశ్వాసాలను మీరే దెబ్బతీసుకున్నట్లు అవుతుందని గుర్తెరగాలి. మీకు మీరే ద్రోహం చేసుకోరాదని గుర్తుచేస్తున్నా. మా లక్ష్యం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు. ఇవి సాధించే దిశగా ముందుకెళ్తున్నాం.