జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడికి పూర్తిగా లొంగిపోయి తక్కువ సీట్లు తీసుకోవడం.. వాటిని కూడా పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా చివర్లో వచ్చిన అవినీతిపరులకు ఇవ్వడం.. తదితర కారణాలతో జనసైనికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అధిష్టానం నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇక మహిళలకు సేనాని అన్యాయం చేశారని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
జనసేన కుల పార్టీ అని స్వయానా రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ మహిళా నేత, కాకినాడ మాజీ మేయర్ పోతసవల్ల సరోజ చెరియన్ స్పష్టం చేశారు. ఆమె ఆదివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం తన భర్త చెరియన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. తన ఆత్మగౌరవాన్ని పార్టీ దెబ్బ తీసిందని కన్నీరు పెట్టుకున్నారు. 21 సీట్లలో ఒక్కటి కూడాæ శెట్టిబలిజలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళకు ఒక స్థానం ఇచ్చారని, అది కూడా ఓడిపోయే సీటు తీసుకున్నారు. పార్టీలో ఉడుకు రక్తం, వీర మహిళలకు ప్రాధాన్యం లేదు. అవినీతిపరులకే అవకాశం ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ కోవర్టు. పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నట్టుగా పోల్, బూత్ మేనేజ్మెంట్లు లేకపోవడానికి కారణం కేవలం మనోహరే. ఆయన పవన్ను, జనసేనను ముంచేశారు. సేనాని కళ్లు తెరవాలి. వారాహి యాత్రలో కత్తిపూడి నుంచి కాకినాడ వరకూ ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్ శెట్టిబలిజలకు ఎందుకు సీటు ఇవ్వలేదు. నేను కాకినాడ రూరల్ సీటు ఆశించి మోసపోయా. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. జనసేన కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీకి వ్యతిరేకంగా పని చేస్తానని ప్రకటించారు.