2024 సార్వత్రిక ఎన్నికలు తెలుగు రాష్ట్రాలలో నాలుగో దశలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే పూర్తి అయిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి మృతితో అక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు రేపే ఆఖరి రోజు కావడంతో రాష్ట్రంలోని ఇరు పార్టీ నేతలు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలై ఐదు రోజులు కావస్తున్నా మొదటి ఐదు రోజుల కంటే ఈ రెండు రోజుల్లోనే ఎక్కువ నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 25 పార్లమెంట్ స్థానాలకు 460 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు, 175 అసెంబ్లీ స్థానాలకు 2677 మంది అభ్యర్థులు ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు 632 నామినేషన్లు దాఖలు అయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆస్థానం కాళీ ఏర్పడింది. ఆస్థానంలో ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదల కాగా ఆస్థానంలో ఇప్పటివరకు 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో రేపు తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం వైయస్ జగన్ తరుపున ఇప్పటికే మొదటి సెట్ నామినేషన్లు దాఖలు అయి ఉన్నాయి. ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 22న కుప్పంలో నామినేషన్ దాఖలు చేసింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురంలో తన నామినేషన్ దాఖలు చేశాడు. బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఈనెల 19న నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్ల ప్రక్రియకు రేపే ఆఖరి రోజు కావడంతో ఈరోజు నామినేషన్లు ఊపందుకున్నాయి.