జనసేన మహిళా విభాగంకు వీర మహిళలు అనే పేరు పెట్టడమే జనసేనలో మహిళలకు చేసిన మంచి అంటూ కాకినాడ ఎంపీ అభ్యర్థి టీ టైమ్ అధినేత ఉదయ్ చెప్పారు. 2024లో జరగబోయే ఎన్నికలలో జనసేన మొదట 50-60 స్థానాలలో పోటీకి దిగుతుందని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ తరువాత 24 సీట్లలో పోటీకి ఒప్పుకున్నారు. వాటిలో మూడు సీట్లను త్యాగం చేసి చివరకు 21 సీట్లలో పోటీకి సాయి అంటున్నారు. ఆ 21 సీట్లలో 18 మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్, కేవలం ఒక మహిళకు మాత్రమే వారిలో చోటు కల్పించడం గమనార్హం.
ఇప్పుడు ఇదే విషయం జనసేన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మహిళా చైతన్యం అంటూ స్పీచ్ లు ఇస్తూ, మహిళలు రాజకీయాల్లోకి రావాలి అని మాటలు చెప్పి తీరా ఎన్నికల సమయానికి మహిళలకు సీట్లు ఇవ్వకుండా వారికి అన్యాయం చేయడం సబబేనా అంటూ జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేవలం ఒక్క మహిళకు మాత్రమే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వడం వెనుక కూడా ఆమె ఆర్థికంగా బలంగా ఉండి పార్టీకి ఫండ్ ఇవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్ పర్యటనలు ఖర్చులని భరించడం వల్లనే ఆమెకు సీటు కేటాయించారని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు.
మహిళలు రాజకీయాల్లోకి రావాలి. మహిళలు చైతన్యం కావాలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పవన్ కళ్యాణ్, టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి కొందరు ఆశావహ మహిళల చేత డబ్బు ఖర్చు చేయించి చివరకు మొండి చెయ్యి చూపించారని వాపోతున్నారు. ముఖ్యంగా ఓవైపు కాకినాడ మాజీ మేయర్ సరోజ తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతుంటే మరోవైపు జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి టీ టైమ్ ఉదయ్ మాత్రం మహిళలకు వీర మహిళలు అని పేరు పెట్టాము కాబట్టి ఇదో గొప్ప విషయం అంటూ వీర మహిళలు సర్దుకుపోవాలి అంటూ చెప్పుకురావడం చూసి వీరమహిళలు ఆగ్రవేశాలతో ఊగిపోతున్నారు.
కేవలం మహిళా విభాగానికి వీర మహిళలు అని పేరు పెట్టడమే గొప్ప విషయం అన్నట్లుగా జనసేన నేతలు చెప్పడం చూస్తుంటే మీకు ఇలా పేరు పెట్టడమే ఎక్కువ సీట్లు కేటాయింపులు లాంటి వాటిపై మాట్లాడకుంటే మంచిదన్నట్టుగా ఉంది. ఇప్పటికైనా జనసేనలో మహిళా నేతలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి మహిళా నేతలు గళం విప్పితే తప్ప వారికి న్యాయం జరగదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.